మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
యువతకు శుభవార్త... కొత్త ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాల భర్తీ - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
వచ్చే ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అచ్చంపేటలో కోటి ఇందిరమ్మ చీరలు, 4.89 లక్షల కొత్త పింఛన్ల పంపిణీతో పాటు రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతామని ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి, నియామకాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు సంతృప్తస్థాయిలో కొత్తగా 4.89 లక్షల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కొత్త పింఛన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 6,00,858 పింఛన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. అచ్చంపేట నియోజకవర్గంలో దాదాపు రూ. 450 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగాల భర్తీతో పాటు పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి, జిల్లా భూముల్లో కృష్ణా జలాలను పారిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని…. మరో ఏడాదిలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసి లక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అచ్చంపేట ఎత్తిపోతల, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవని అన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు కృష్ణా జలాల సమస్యే ఉండేది కాదని…. రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకుంటే ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు సాగయ్యేవని చెప్పారు. పాలమూరు జిల్లా బిడ్డగా ఇక్కడి పొలాలను కృష్ణా నీటితో తడపాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పై ఫైర్…
తెలంగాణ నీటి హక్కులను గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు రూ. లక్ష కోట్లు సంపాదించారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాలను వాడుకోవడం లేదని, అందుకే నీళ్లు పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఆ నీళ్లు తెలంగాణ పొలాలకు పారేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పలు ప్రాజెక్టుల ద్వారా 'నీటి దొంగల్లా' కృష్ణా జలాలను తరలిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ 'బానిసత్వం' చేశారా అని ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలుగా అంగీకరించి…. కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టీ. హరీశ్ రావు తెలంగాణ సాగునీటి రంగానికి మరణశాసనం రాశారని రేవంత్ ఆరోపించారు.
ప్రతిపక్ష నేతగా సుమారు రూ. 2 కోట్ల వేతనం తీసుకుంటూ, గత మూడేళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని కేసీఆర్‌ను రేవంత్ విమర్శించారు. రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపి, రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ….. 2028లో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 90 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

E-Paper
