Congress Samvidhan Raksha March : రాజ్యాంగంపై మోదీ ముఠా దాడిని తిప్పికొట్టాలి - సీఎం రేవంత్ రెడ్డి

Congress Samvidhan Raksha March : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ముఠా రాజ్యాంగంపై దాడి చేస్తోందని… ఆ దాడిని మనం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Published on: Nov 26, 2026, 17:51:58 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Congress Samvidhan Raksha March : మోదీ ముఠా నుంచి రాజ్యాంగాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌ పని చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ‘ సంవిధాన్‌ రక్షా మార్చ్‌’ పేరిట భారీ ర్యాలీ చేపట్టారు.

సంవిధాన్‌ రక్షా మార్చ్‌ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు
సంవిధాన్‌ రక్షా మార్చ్‌ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ…. "మోదీ గ్యాంగ్" దాడుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదానీ, అంబానీలతో కూడిన 'దుష్ట చతుష్టయం' దేశ సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే కారణంతోనే వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇప్పటికే ఈ వర్గాలకు చెందిన 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని…. మరో ఏడు కోట్ల మందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు.

"ఓటర్ల జాబితాలో ఎవరిని చేర్చాలో కేంద్రమే నిర్ణయిస్తోంది. ఎన్నికల సంఘాన్ని ఒక పావులా వాడుకుంటోంది," అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా, దళితులు, ఎస్టీలు, మైనారిటీల హక్కుల కోసం సాగుతున్న పోరాటం 'గాంధీ వారసులు, గాడ్సే వారసుల' మధ్య జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గాంధీ పరివార్ vs సంఘ్ పరివార్

బీజేపీ ఇప్పుడు 'జ్ఞానేశ్ కమిషన్'ను తీసుకొచ్చిందని, మోదీకి శాశ్వత అధికారం కట్టబెట్టడానికే 'ఓట్ల తొలగింపు' వ్యవహారం నడుస్తోందని రేవంత్ ఆరోపించారు. బ్రిటిష్ వారిపై భగత్ సింగ్ పోరాడితే, ఇప్పుడు మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీజీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల వారసుడిగా రాహుల్ నిలిచారని చెప్పారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా దళితులు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం ఆయన పోరాటం చేస్తున్నారని తెలిపారు.

మహాభారతంతో పోలుస్తూ కాంగ్రెస్ నేతలను ఐదుగురు 'పాండవులు'గా రేవంత్ అభివర్ణించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ మహాత్మా గాంధీ వారసులుగా రాజ్యాంగాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు 'మోదీ, ఆయన బృందం' కౌరవుల్లా, గాడ్సే వారసుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇది కేవలం ఎన్నికల పోరు లేదా కాంగ్రెస్ ఒక్కదాని పోరాటం కాదని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సాగుతున్న యుద్ధమని చెప్పారు. గాంధీ వారసులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. "గాడ్సే వారసులను ఓడించాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఇది సంఘ్ పరివార్ వర్సెస్ గాంధీ పరివార్ పోరాటం," అని స్పష్టం చేశారు.

2029 లక్ష్యం.. తెలంగాణలో సీట్లపై ధీమా

దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ అయితే, కేవలం అధికారం కోసమే బీజేపీ పుట్టిందని రేవంత్ ఆరోపించారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టి మాట్లాడుతూ, 2029 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించినప్పుడే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోటి ఓట్లు సాధించాలని… 90 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు. పేదల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామనే అబద్ధపు హామీలతో, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ, మత, భాషా పరంగా ప్రజలను విభజిస్తూ మోదీ మూడుసార్లు గెలిచారని ఆరోపించారు.

"నాలుగోసారి ప్రధానమంత్రి కావాలనే అత్యాశతో 'దుష్ట చతుష్టయం' ఆలోచిస్తోంది. దుష్ట చతుష్టయం అంటే నరేంద్ర మోదీ జీ, అమిత్ షా జీ, అదానీ జీ, అంబానీ జీ. దేశ సంపదను కొల్లగొట్టేందుకు…. శాశ్వత అధికారం కోసం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు," అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌తో పాటు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.