తెలంగాణకు పాలసీ పెరాలసిస్ లేదు.... పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం - సీఎం రేవంత్
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (PHFI) శంకుస్థాపన సభలో వైద్య, ఫార్మా రంగాల అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి విధానపరమైన గందరగోళం గానీ, పాలసీ పెరాలసిస్ గానీ లేదని ఆయన భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలను రూపొందించామన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (PHFI) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

పీహెచ్ఎఫ్ఐకి నేనే బ్రాండ్ అంబాసిడర్….
విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు రావడంలో ఐఎస్బీ, నల్సార్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. కొత్తగా నిర్మిస్తున్న పీహెచ్ఎఫ్ఐ పనులను 2028 జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పీహెచ్ఎఫ్ఐకి తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. వైద్య రంగంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి ఈ సంస్థ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం వివరించారు. ఇప్పటికే సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామని, త్వరలోనే మిగతా టిమ్స్ ఆస్పత్రులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గోషామహల్లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల అభివృద్ధి కోసం మొత్తం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.2,500 కోట్లు వెచ్చిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి రాష్ట్రంలో రోగుల సమగ్ర వివరాలను సేకరించామని చెప్పారు. తెలంగాణ ఒక డేటా రిచ్ స్టేట్ అని, ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చని వివరించారు.
దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం వాటా హైదరాబాద్‌దేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 1960వ దశకంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ఏర్పాటు కావడం వల్లే ఇక్కడ ఫార్మా రంగానికి బలమైన పునాదులు పడ్డాయన్నారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నేడు హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCC) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని, మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు కూడా పెట్టుబడుల కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.
డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్…
తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌ను రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను విభజించామన్నారు. పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
"తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి కూడా న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలి," అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు…. ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మూసీ నదిని ప్రక్షాళన చేయడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

