...
...
Next Story

గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గెలిపిస్తే అభివృద్ధి జరగదు : సీఎం రేవంత్

పాలమూరు ప్రాజెక్టులను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని గతంలో ఏ నేత కూడా అనుకోలేదని విమర్శించారు.

Published on: Dec 1, 2025, 18:24:07 IST
Advertisement

నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దానికంటే ముందు వనపర్తి జిల్లా ఆత్మకూరులోనూ పర్యటించిన రేవంత్ రెడ్డి రూ.151.92 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

'ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారు. మక్తల్ నుంచి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మక్తల్, నారాయణపేట, కొడంగల్‌కు సాగునీరు ఇవ్వాలని ఎవరికీ అనిపించలేదు. మన కష్టాలను తీర్చడానికి మీ సోదరుడిగా, మీతోపాటు పెరిగిన బిడ్డగా ముఖ్యమంత్రిగా వచ్చాను. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

గతంలో కేసీఆర్‌ను గెలిపించి సీఎంగా చేస్తే మన జిల్లాలో ఎలాంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.12 కోట్లు కేటాయించిన సంగంబండ రిజర్వాయర్ పూర్తి చేయలేదన్నారు. మంత్రి మండలి సహకారంతో ఇక్కడ అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. రెండు సంవత్సరాలలో నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా అడ్డుపడితే ఊరుకోమని చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చిన మెుదట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత 75 ఏళ్లలో ఎవరూ కాలేదన్నారు. ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డారన్నారు. అనేక దశబ్దాలుగా పాలమూరు జిల్లా కరవు, వలసలకు మాత్రమే పేరు పొందిందని చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లను మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'మా ప్రభుత్వంలో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టాం. దేశానికి, రాష్ట్రానికి పాలమూరుని ఆదర్శంగా మారుస్తాం. ఇరిగేషన్‌, ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యాత ఇస్తున్నాం.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks