...
...
Next Story

‘మిగతా వాళ్లు కూడా జనజీవన స్రవంతిలోకి రండి’ - మావోయిస్టులకు సీఎం రేవంత్ పిలుపు

గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని అన్నారు. ఇప్పటికే పలువురు మావోయిస్టులు లొంగిపోయారని… మిగతా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

Published on: Oct 21, 2025, 12:24:47 IST
Advertisement

పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని వారి సేవలను కొనియాడారు. ఇవాళ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తోందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయని… ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలని సూచించారు.

జనజీవన స్రవంతిలోకి రండి - సీఎం రేవంత్

మావోయిస్టుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని గుర్తు చేశారు. అయితే ఇంకా అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని… ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు వారి ఆలోచనలను కూడా పంచుకోని… ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేసేందుకు ముందుకు రావాలన్నారు.

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe