...
...
Next Story

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

Published on: Oct 28, 2026, 17:57:14 IST
Advertisement

హైద‌రాబాద్‌ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వల‌ను ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తూ ఉండాల‌ని చెప్పారు. క్యూర్ పరిధిలో మంచినీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్‌హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్‌లో ముఖ్యమంత్రి స‌మీక్ష నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భ‌విష్యత్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ప్రాంత పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు(STP) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాల‌ని ఆదేశించారు. సచివాలయంతో పాటు సీఎంఓ, అవుట‌ర్ రింగ్, మెట్రో రైల్, ఇత‌ర శాఖ‌ల‌ కార్యాల‌యాల్లో పచ్చదనం నిర్వహణ కోసం, ఇత‌ర అవ‌స‌రాల‌కు శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చూడాల‌ని తెలిపారు. ప‌బ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు కూడా ట్రీటెడ్ వాట‌ర్‌నే వాడాలన్నారు.

భ‌వ‌న నిర్మాణంలో శుద్ధి చేసిన నీటినే వాడాల‌నే నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను ప‌రిశీలించాల‌ని రెడ్కో ఉన్నతాధికారుల‌ను ఆదేశించారు.

ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించాల‌ని చెప్పారు. నీటి నాణ్యత విష‌యంలో ఏ మాత్రం రాజీ ప‌డొద్దన్నారు. ప్రతి నీటిశుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ప్రస్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాట‌ర్‌ను గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు జ‌ల‌మండ‌లి అధికారులు వివరించారు. వినియోగ‌దారుల నుంచి కేవ‌లం ర‌వాణా రుసుం మాత్రమే వ‌సూలు చేస్తున్నామ‌ని, నీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks