...
...
Next Story

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని.. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతరాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలన్నారు.

Published on: Nov 15, 2026, 20:42:21 IST
Advertisement

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన తర్వాత ప్రాజెక్టుల ప‌నులు వేగ‌వంతం చేశామ‌ని, భూ నిర్వాసితుల‌కు ప‌రిహారాన్ని వేగంగా అంద‌జేస్తున్నామ‌ని ప్రధాన‌మంత్రికి వివరించారు.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, శ్రీహరి భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, శ్రీహరి భేటీ

న‌రేంద్ర మోదీతో రేవంత్ రెడ్డి.. ప్రధాన‌మంత్రి అధికారిక నివాసంలో స‌మావేశమయ్యారు. స‌మావేశంలో కేంద్ర క్రీడా, యువ‌జ‌న వ్యవ‌హారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, యువ‌జ‌న శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు +152 మీటర్ల వ‌ద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల‌ని ప్రధాన‌మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్.

మ‌హారాష్ట్రలో ముంపున‌కు అవ‌స‌ర‌మైన ప‌రిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవ‌స‌రాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని ముఖ్యమంత్రి గారు కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవ‌కాశం కలుగుతుంద‌ని చెప్పారు.

డాక్టర్ ఎస్. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకలపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేద‌ని ప్రధాన‌మంత్రికి వివరించారు.

ఈ ఆర్థిక సంవ‌త్సరంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు స‌ర‌ఫరా చేసేందుకు వీలవుతుంద‌ని ప్రధానికి తెలిపారు. ఫ‌లితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంద‌న్నారు.

స‌మ్మక్క సాగ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి సమర్పించామ‌ని ప్రధాన‌మంత్రికి తెలియ‌జేశారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపున‌కు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం, బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విష‌యాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ఛ‌త్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం త్వరగా జారీ అయ్యేలా చూడాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద ఇంటిగ్రేటెడ్ స‌మ్మక్క సాగ‌ర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాల‌ని కోరారు.

హైద‌రాబాద్‌లో డిసెంబ‌రు నెల‌లో నిర్వహించ‌నున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆహ్వాన ప‌త్రిక‌ను అందించడంతో పాటు యూత్ గేమ్స్ లోగో, మ‌స్కట్‌ల గురించి వివ‌రించారు.

డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు యువ క్రీడాకారులకు ఇదొక చక్కని వేదిక కానుంద‌ని తెలిపారు. 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చ‌రిత్ర తెలంగాణ‌కు ఉంద‌ని వివరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks