...
...
Next Story

దేశభక్తి విషయంలో మోదీ, అమిత్ షాకు అసదుద్దీన్ తక్కువేమీ కాదు - సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ అభివృద్ధి, సైనికుల విజయం కోసం ఎంఐఎం నేతలు ఎప్పుడూ ముందుంటారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలు వేరు, దేశభక్తి వేరు అని చెప్పుకొచ్చారు. మోదీ, అమిత్ షా కంటే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఏమాత్రం తక్కువ దేశభక్తులు కారని అన్నారు.

Published on: Sep 4, 2026, 09:23:16 IST
Advertisement

హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని పునరుద్ఘాటించారు. గతంలో రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వారెవరూ ఈ ప్రాంతానికి రాలేదని, మీ గుండెల్లో స్థానం పొందడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఓవైసీ సోదరులను ఉద్దేశించి… ప్రశంసలు కురిపించారు,దేశభక్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వారిద్దరూ ఏమీ తక్కువ కాదని సీఎం వ్యాఖ్యానించారు.

సీఎంతో అసదుద్దీన్
సీఎంతో అసదుద్దీన్

హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన వంతెన (చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ ఫ్లైఓవర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులు దేశానికి వ్యతిరేకం అంటూ కొందరు చేస్తున్న విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అలాంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం అంగీకరించబోనని చెప్పారు.

కార్గిల్ యుద్ధ సమయం లేదా ఆపరేషన్ సింధూర్ వంటి కీలక సందర్భాలలో భారత సైనికులకు మద్దతుగా తాము చేపట్టిన ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారని సీఎం గుర్తుచేశారు. ఆనాడు భారత ఆర్మీ విజయం సాధించాలని ఒవైసీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారని తెలిపారు. వివిధ రాజకీయ వేదికలపై, విభిన్న అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చని, కానీ దేశభక్తి విషయానికి వస్తే అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు.

"వారు నిఖార్సయిన దేశభక్తులు. ఒక ముఖ్యమంత్రిగా, పూర్తి బాధ్యతతో ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. దేశాన్ని రక్షించే విషయంలో నరేంద్ర మోదీ, అమిత్ షాల కంటే వారు ఏమాత్రం తక్కువ కాదు. దేశ భద్రత, పరిరక్షణ విషయానికి వస్తే వారు ఎప్పటికీ వెనకడుగు వేయరు. ఎన్నికల్లో రాజకీయం వేరు, దేశభక్తి వేరు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షాలను, లేదా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఎంఐఎం ప్రయత్నించి ఉండవచ్చు. అది ఎన్నికల ప్రక్రియలో సహజంగా జరిగే రాజకీయ పోరాటం మాత్రమే" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఏ కాంగ్రెస్ పార్టీకో కాకుండా, రేవంత్ రెడ్డి అనే నాయకుడి నేతృత్వంలోని ప్రభుత్వానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు" అని అసదుద్దీన్ తేల్చిచెప్పారు. గతంలో తమ పార్టీ బీఆర్ఎస్‌కు కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని తాము ఆకాంక్షిస్తున్నామని అసదుద్దీన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పాడవకుండా, మతతత్వం పెరగకుండా చూడాలని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులు తెలంగాణలో రాకూడదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks