సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ - ‘గ్లోబల్ సమ్మిట్’ కోసం ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఆహ్వానాలు..!
తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని మోదీ, ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానాలు అందిస్తారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల మందికిపైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

పలువురికి ఆహ్వానాలు…
మంగళవారం రాత్రే రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఖర్గే, రాహుల్ గాంధీలకు ఆహ్వానం పలికిన తర్వాత…. ఆయన డిసెంబర్ 3న మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరిగి వస్తారని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ సదస్సులో భాగంగా 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు యోచిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గ్లోబల్ సమిట్ అత్యంత విజయవంతం చేయటానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, ప్రసార మాధ్యమాల ప్రముఖులు, దౌత్యవేత్తల ను మరియు వివిధ రంగాల కు చెందిన నిపుణుల ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పలు రంగాలకు చెందిన 4,500 మంది ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. వారిలో 1,000 మంది తమ రాకను ధృవీకరించారని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
నినాదం ఇదే… భారీగా ఏర్పాట్లు
“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ , ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ , పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.
‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.
ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.
తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు.













