...
...
Next Story

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, ఆస్తుల కోసం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌‌ను చంపిన భార్య

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, ఆస్తుల కోసం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌‌ను ఆయన భార్య చంపింది. ఈ గటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

Published on: Aug 17, 2026, 14:05:03 IST
Advertisement

కష్టపడి, సర్వీసు ముగించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ అధికారికి రిటైర్మెంట్‌కు ముందే నూరేళ్లు నిండాయి. ఏళ్ల తరబడి కలిసి ఉన్న భార్యే, ఆస్తులు, ఆర్థిక వివాదాల నేపథ్యంలో కాలయముడిగా మారింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

క్రైమ్ న్యూస్ (istock image)
క్రైమ్ న్యూస్ (istock image)

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన వెంకటేశం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా ఆసిఫాబాద్‌లో విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈ నెలలోనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా ఆయన మొదటి భార్య రాజమణి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎమ్‌గా పనిచేస్తోంది. వెంకటేశానికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య రాజమణితో గత కొంతకాలంగా ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు నడుస్తున్నాయి.

త్వరలోనే వెంకటేశం పదవీ విరమణ చేయనుండటంతో ఆయనకు రాబోయే రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు), ఇతర ఆస్తుల పంపకంపై దంపతుల మధ్య ఘర్షణ మొదలైంది. ఆదివారం హనుమాన్ నగర్‌లోని తమ నివాసంలో ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

మాటమాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజమణి, ఇంట్లోనే ఉన్న రాయితో వెంకటేశంపై తీవ్రంగా దాడి చేసింది. తలకు బలమైన గాయం కావడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వెంకటేశం చికిత్స పొందుతూ కన్నుమూశారు.

జీవిత చరమాంకంలో తోడుగా ఉంటూ ఒకరికొకరు ఆసరాగా నిలవాల్సిన భార్యాభర్తలు, ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కాసుల కక్కుర్తి ముందు దశాబ్దాల దాంపత్య బంధం, ప్రేమానురాగాలు ఓడిపోయాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఉద్యోగ విరమణ చేసి ప్రశాంతంగా గడపాల్సిన ఒక అధికారి, కట్టుకున్న భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురి అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe