Medical Tourism : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మెడికల్ టూరిజం.. పరిశీలనకు కమిటీ!
ప్రభుత్వ ఆసుపత్రులలో అంతర్జాతీయ వైద్య పర్యాటకాన్ని ప్రవేశపెట్టి, ప్రోత్సహించే అంశాలను పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించేందుకు, ‘మెడికల్ టూరిజం’ (వైద్య పర్యాటకం)ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర పర్యాటక విధానం 2025–2030 (Tourism Policy 2025–2030) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 'మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజం' రంగాన్ని ప్రధాన ఫోకస్ సెక్టార్‌గా గుర్తించారు.

ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో అంతర్జాతీయ వైద్య పర్యాటక సేవలను ఏ మేరకు తీసుకురావచ్చో అధ్యయనం చేసి, నెల రోజుల్లోగా నివేదికతో పాటు సిఫార్సులను అందజేయాలని ఈ కమిటీని ఆదేశించారు.
ముగ్గురు సభ్యుల కమిటీ వివరాలు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి కమిటీలో ముగ్గురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC) మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమి, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ నాగరి బీరప్ప ఇందులో ఉన్నారు.
కమిటీ బాధ్యతలు - ప్రధాన విధులు:
విదేశీ రోగులను ఆకర్షించడం, వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం కోసం ఈ కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో అంతర్జాతీయ వైద్య పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఒక 'ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్'ను ఏర్పాటు చేసే ప్రక్రియను ఈ ప్యానెల్ పరిశీలిస్తుంది.
విదేశీయులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ రకమైన వైద్య, సర్జికల్, డయాగ్నస్టిక్ (వ్యాధి నిర్ధారణ) సేవలు అందించవచ్చో గుర్తిస్తుంది. వాటికి సంబంధించిన ప్యాకేజీ ధరలు లేదా రేట్లను నిర్ణయించే విధానాన్ని సిఫార్సు చేస్తుంది.
విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు
విదేశాల నుండి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భాషా అనువాదకులు (లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్), వారి అలవాట్లకు తగినట్లుగా డైట్ (ఆహార) ఏర్పాట్లు, సహాయకుల (అటెండెంట్) సేవలు వంటి మద్దతు వ్యవస్థలపై ఈ కమిటీ సూచనలు చేయనుంది. తెలంగాణ మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డ్‌తో సమన్వయం చేసుకుంటూ, అంతర్జాతీయ మార్కెట్‌లో మన వైద్య సేవలను ఎలా ప్రమోట్ చేయాలో ఈ కమిటీ వ్యూహాలను రచిస్తుంది.
మెడికల్ టూరిజం అంటే ఏంటి?
తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన వైద్యం, ఆపరేషన్ల కోసం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించడాన్ని మెడికల్ టూరిజం అంటారు. సాధారణంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే ఇలాంటి సేవలను అందిస్తుంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోనే దీనిని తీసుకురావాలని చూస్తోంది.
విదేశీ రోగుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల స్థానిక పేద రోగులకు కూడా మరింత నాణ్యమైన వైద్యం ఉచితంగా అందే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


