తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు గ్రీన్ సిగ్నల్ - కేకే కమిటీ తొలి భేటీలో కీలక నిర్ణయాలు
Telangana Activists Recognition Committee : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం నియమించిన కేశవరావు కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజకీయాలకు అతీతంగా…. నాలుగు కేటగిరీల్లో నిజమైన ఉద్యమకారులను ఎంపిక చేయాలని కమిటీ స్పష్టం చేసింది.
Telangana Activists Recognition Committee : స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ అధికారికంగా ఊపందుకుంది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తన తొలి సమావేశాన్ని నిర్వహించింది. కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల చిరకాల ఆకాంక్షను గుర్తిస్తూ…. ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను అత్యంత పవిత్రంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని కమిటీ భావించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి కింద ఉన్న కార్యాలయంలోనే ఈ కమిటీ అధికారిక ఆఫీసును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఉద్యమకారులకు ఈ కార్యాలయం సులువుగా అందుబాటులో ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారు.
నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు అందరి భాగస్వామ్యాన్ని తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలోనే ఒక సర్వపక్ష సమావేశాన్ని (ఆల్ పార్టీ మీటింగ్) ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతిపాదనలు సేకరిస్తారు.
కేవలం రాజకీయ పార్టీలకే పరిమితం కాకుండా తెలంగాణ ఉద్యమ జేఏసీ…. 1969 నాటి ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, సాంస్కృతిక కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీతో పాటు జిల్లాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వివిధ ఉద్యమ సంఘాల నుంచి కూడా వినతులు, సూచనలు స్వీకరిస్తారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా….. ఈ కమిటీ సభ్యులు త్వరలోనే అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించనున్నారు.
నాలుగు కేటగిరీల్లో ఉద్యమకారుల గుర్తింపు
అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ నాలుగు రకాల కేటగిరీలను ప్రతిపాదించింది:
- మొదటి ప్రాధాన్యత (కేటగిరీ-1) : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు.
- రెండవ ప్రాధాన్యత (కేటగిరీ-2) : ఉద్యమ సమయంలో లాఠీచార్జీలు, పోలీస్ చర్యల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఈ కేటగిరీ కింద గుర్తిస్తారు.
- మూడవ ప్రాధాన్యత (కేటగిరీ-3) : స్వరాష్ట్ర పోరాటంలో జైలుకు వెళ్లినవారు, అరెస్ట్ అయినవారు…. వివిధ పోలీస్ స్టేషన్లలో ఉద్యమ కేసులు నమోదైన వారిని ఇందులో చేరుస్తారు.
- నాల్గో ప్రాధాన్యత (కేటగిరీ-4): రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉంటూ గ్రామాలు, మండలాల్లో నిరంతరం ఉద్యమించిన వారిని ఈ కేటగిరీలో గుర్తిస్తారు. అయితే, ఈ నాల్గవ కేటగిరీని నిష్పాక్షికంగా నిర్ధారించేందుకు…. వారు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నట్లు ఆధారంగా ఉన్న వార్తా పత్రికల క్లిప్పింగులు (పేపర్ కటింగ్స్) మరియు ఇతర పక్కా ఆధారాలను పరిశీలిస్తారు.
రాజకీయాలకు అతీతంగా ఎంపిక
ఈ కమిటీ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజకీయ పక్షపాతానికి తావుండదని చైర్మన్ కేశవరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం కొంతమందికి మాత్రమే సహాయం అందిందని…. ఈసారి అలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పార్టీల పట్టింపులు పక్కనబెట్టి అర్హులందరినీ గుర్తిస్తామని కమిటీ పేర్కొంది. పౌర సమాజంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపించిన మేధావులు, కీలక వ్యక్తులతో పాటు 1969, 1972, 1996 నాటి వివిధ దశల ఉద్యమకారులతోనూ ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

