...
...
Next Story

పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణంలో పెద్ద స్కామ్.. సీఎం రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రావణ్ ఆరోపణలు

రాయదుర్గంలో రూ. 1,700 కోట్ల భూ దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రావణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated on: Aug 12, 2026, 17:55:43 IST
Advertisement

హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా చేపడుతున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణంలో దాదాపు రూ.1700 కోట్ల విలువైన ఏడెకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీలకు కట్టబెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్రంగా ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ధర సుమారు రూ. 250 కోట్లు ఉంటే, అక్కడ ఉన్న ఏడెకరాల స్థలాన్ని టెండర్లు, అగ్రిమెంట్లు లేకుండా వంశీరామ్, అపర్ణ బిల్డర్స్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధారాదత్తం చేసిందని దాసోజు శ్రావణ్ విమర్శించారు.

ప్రతి రాష్ట్రంలో స్థానిక ఉత్పత్తుల విక్రయాల కోసం పీఎం ఏక్తా మాల్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని కేటాయించింది. కానీ ఈ ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ మాల్‌లో మొత్తం 27 లక్షల చదరపు అడుగుల (27 అంతస్తులు) నిర్మాణం జరుగుతుంటే, ప్రభుత్వానికి కేవలం 9 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చి, మిగిలిన 18 లక్షల చదరపు అడుగుల విలువైన ప్రాపర్టీని ప్రైవేటు బిల్డర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.

ఈ నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ కానీ, టెండర్ డాక్యుమెంట్లు కానీ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేవని శ్రావణ్ వెల్లడించారు. 'తెలంగాణ అమరవీరుల సాక్షిగా సవాల్ చేస్తున్నాం.. నిజాయితీ ఉంటే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ టెండర్లను రద్దు చేసి, బహిరంగ చర్చకు రావాలి.' అని దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రాజెక్టు పరిధిలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదని శ్రావణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై చిల్లర దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. 'ఒకవైపు పేదవారు ఇండ్లు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న ఈ ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతోంది. టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులతో పాటు రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుంది.' అని స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe