SIR Enumeration : మీ ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించారా..? ఇవాళ ఒక్కరోజే ఛాన్స్

ప్రత్యేక  ఓటరు సమగ్ర సవరణ (సర్‌) ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణకు నేటితో గడువు ముగియనుంది. పత్రాలు ఇవ్వకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Published on: Aug 10, 2026, 07:35:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియకు ఇవాళ్టి(ఆగస్ట్ 10,2026)తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఫారాలు సమర్పించని ఓటర్లకు ఈరోజే ఆఖరి అవకాశమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకపోతే రాబోయే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో సర్ - ఇవాళ ఒక్కరోజే  ఛాన్స్
తెలంగాణలో సర్ - ఇవాళ ఒక్కరోజే ఛాన్స్

ఇప్పటివరకు లెక్కలు ఇలా….

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 2.64 కోట్ల మంది వివరాలను డిజిటలైజేషన్‌ చేశారు. ప్రస్తుతం బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌వో) వద్ద మరో ఐదు లక్షల పత్రాలు డిజిటలైజేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి.

మరోవైపు ఇంకా 69 లక్షల మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని అధికారులు తెలిపారు. ఎన్నికల రికార్డుల్లో ఈ ఓట్లను 'అన్‌కలెక్టబుల్' విభాగం కింద చేర్చారు. ఓటర్లు ఇచ్చిన చిరునామాలో నివసించకపోవడం, మరణించడం, వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా ఒకరికంటే ఎక్కువ చోట్ల ఓటు (డూప్లికేట్) ఉండటం వంటి కారణాల వల్ల వీటిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించారు. అయితే అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. పొరపాటున ఎవరైనా అన్‌కలెక్టబుల్ జాబితాలో చేరి ఉంటే…. వెంటనే తమ వివరాలను సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించారు.

ఒకవేళ ఎస్‌ఐఆర్‌-2002 వివరాలు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫారంలోని మిగతా సమాచారాన్ని నింపి బీఎల్వోలకు అందజేయవచ్చు. ఒకవేళ ఆ తర్వాత ఏవైనా నోటీసులు వస్తే… ఏదైనా అధికారిక గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును సురక్షితంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

ఈనెల 17న ముసాయిదా జాబితా

ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించి డిజిటలైజేషన్ పూర్తయిన ఓటర్ల వివరాలతో ఈ నెల 17న అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత సమయంలోగా డిజిటలైజేషన్ కాని ఓటర్ల వివరాలు ఈ ముసాయిదా జాబితాలో ఉండవు.

మరోవైపు వివరాలపై సందేహాలు ఉన్న ఓటర్లకు ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందుకున్న వారు సంబంధిత ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) ముందు నేరుగా హాజరై, కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సరిగ్గా పూర్తి చేసిన వారి పేర్లను మాత్రమే అక్టోబరు 19న విడుదల చేసే ఓటర్ల తుది జాబితాలో చేర్చుతారు.

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను జూన్ 25న చేపట్టగా…. తొలి గడువు జూలై 24గా నిర్ణయించారు. ఆ గడువును ఆగస్టు 3కి… ఆ తర్వాత ఆగస్టు 10కి సవరించారు. అంటే ఇవాళ్టితో సర్ ప్రాసెస్ ముగుస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించకపోతే… వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More