తెలంగాణ నేలల్లో తగ్గుతున్న సేంద్రీయ కార్బన్.. మట్టిలో తేమ నిలుపుదల సామర్థ్యంపై ఆందోళన

తెలంగాణలో ఎల్ నినో కారణంగా వ్యవసాయ పరిస్థితులపై ఆందోళనలు పెరుగుతోంది. మరోవైపు నేలల్లో తేమను నిలుపుకునే సామర్థ్యంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ జరిపిన పరీక్షల్లో చాలా జిల్లాల్లో సేంద్రీయ కార్బన్ శాతం మధ్యస్థంగా లేదా తక్కువగా ఉన్నట్లు తేలింది.

Published on: Oct 18, 2026, 18:21:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి నేలలోని సేంద్రీయ కార్బన్(Organic Carbon) తగ్గుదల కొత్త సవాలుగా మారింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో మట్టిలో సేంద్రీయ కార్బన్ స్థాయిలు తక్కువగా లేదా సగటు స్థాయిలో మాత్రమే ఉన్నాయని మట్టి పరీక్షల్లో తేలింది. నేలలో సేంద్రీయ కార్బన్ తగినంతగా ఉంటేనే అది నీటిని పట్టి ఉంచే (తేమ నిలుపుదల) సామర్థ్యాన్ని పొందుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అంతేకాకుండా ఇది సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచడానికి, పంటలకు పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. భూమిలో సేంద్రీయ కార్బన్ క్షీణించడం వల్ల మట్టి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. వర్షాభావం లేదా ఎండ తీవ్రత పెరిగినప్పుడు పంటలు త్వరగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రైతులు నేల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ నివేదికలు సూచిస్తున్నాయి.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో తెలంగాణలో దాదాపు రెండు లక్షల మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించారు. 2019-20లో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ఇటీవల పునరుద్ధరించారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. రాష్ట్రంలోని 621 మండలాలకు గానూ 2024-25, 2025-26 సంవత్సరాల్లో ప్రతి మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నామమాత్రంగా పరీక్షలు జరిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

మట్టి పరీక్షల వెల్లడైన ఫలితాలు చూసుకుంటే.. పరీక్షించిన నేలల్లో కేవలం 14 శాతం పరిధిలోనే తగినంత ఉన్నత స్థాయి సేంద్రీయ కార్బన్ ఉన్నట్లు తేలింది. చాలా జిల్లాల్లో నత్రజని లోపం తీవ్రంగా ఉంది. దాదాపు 20 శాతం నేలల్లో భాస్వరం, పొటాషియం స్థాయిలు చాలా తక్కువగా నమోదయ్యాయి.

తెలంగాణలో వెల్లడైన ఫలితాలు దేశవ్యాప్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్' (ICRIER) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని నేలల్లో కేవలం 25 శాతం మాత్రమే తగినంత సేంద్రీయ కార్బన్‌ను కలిగి ఉన్నాయి.

ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల నేలల్లో సేంద్రీయ కార్బన్ స్థాయి 1 శాతం నుండి 1.5 శాతం వరకు ఉండాలి. కానీ దేశంలో దాదాపు 73 శాతం నుండి 76 శాతం వ్యవసాయ భూముల్లో ఇది 0.5 శాతం కంటే తక్కువకు పడిపోయిందని ఐసీఆర్ఐఈఆర్ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, తేమను నిలిపి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రకృతి వ్యవసాయం ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేసే పొలాల్లో దిగుబడి సగటున 11 శాతం ఎక్కువగా నమోదైంది. పెట్టుబడి ఖర్చులు తగ్గడం వల్ల రైతుల నికర ఆదాయం 49శాతం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF)లో చేరింది. అయితే ఈ పద్ధతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భూముల్లో నేల తేమను ఎంతమేరకు పెంపొందిస్తాయి అనేది రైతులు వీటిని ఎంత పక్కాగా అమలు చేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More