...
...
Next Story

వనదేవతలకు మెుక్కులు చెల్లించేందుకు మేడారానికి భారీగా భక్తులు.. డ్రోన్ విజువల్స్!

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Published on: Jan 11, 2026 07:04 PM IST
Advertisement

ఓ వైపు సంక్రాంతి సెలవులు, మరోవైపు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ములుగు జిల్లాలోని మేడారంలో జనసందోహం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు మెుక్కులు చెల్లించడానికి రావడంతో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. భారీ రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మేడారం
మేడారం

సంక్రాంతి సెలవులు కావడంతో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా వచ్చి వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం గద్దెల దగ్గర మెుక్కులు సమర్పిస్తున్నారు.

మేడారం చుట్టూ భక్తులు కిటకిటలాడుతున్నారు. నిజానికి జనవరి 28వ తేదీ నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ఆ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. విపరీతమైన రద్దీ ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగానే వచ్చి దర్శనం చేసుకుంటారు.

జంపన్న వాగులో స్నానమాచరించి.. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుంటారు. పసుపు, కుంకుమ సమర్పిస్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి.. మెుక్కులు చెల్లిస్తారు. మేడారం దిక్కు చాలా వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇప్పటికే హన్మకొండ, వరంగల్ రోడ్లపై ట్రాఫిక్ మెుదలైంది. మరోవైపు ములుగు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పస్రా, తాడ్వాయి పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు ఏర్పాటు చేశారు. గద్దెల వద్ద క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఆదివారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క మేడారాన్ని సందర్శించి మెుక్కులు చెల్లించుకున్నారు.

జాతర కోసం వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. మేడారంలో 3 హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులను అందుబాటులో ఉంచనుంది.

జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన హాస్పిటల్ (శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాల) ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనికి అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe