రూ. 2 లక్షల లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో
రంగారెడ్డి జిల్లా మెడికల్ హెల్త్ అధికారి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి ఏసీబీ వలకు చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇదే కేసులో హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్యను కూడా అదుపులో తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారం కలకలం రేపింది. ఫిజియోథెరపీ సెంటర్ పై విధించిన సీజ్ ను ఎత్తివేయటంతో పాటు... కొత్త లైసెన్స్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎమ్‌హెచ్‌ఓ) స్వర్ణకుమారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇదే కేసులో హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్యను కూడా అదుపులో తీసుకున్నారు.

రూ. 2 లక్షల లంచం డిమాండ్…
ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..... రంగారెడ్డి జిల్లా డిఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ బి. స్వర్ణకుమారి (AO-1), అదే కార్యాలయంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాస్ (AO-2) సూచనల మేరకు ప్రైవేటు డ్రైవర్ మద్దూరి కృష్ణయ్య (A-3) బాధితుడి నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు నడుపుతున్న ఫిజియోథెరపీ సెంటర్‌ను గతంలో అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సెంటర్ తాళాలను తిరిగి ఇవ్వడానికి, డిఎమ్‌హెచ్‌ఓ లైసెన్స్ లేకుండా సెంటర్ నిర్వహించినందుకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, అలాగే సదరు ఫిజియోథెరపీ సెంటర్‌కు కొత్తగా డిఎమ్‌హెచ్‌ఓ లైసెన్స్ జారీ చేసేందుకు గాను ఈ లంచం డిమాండ్ చేశారు.
కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, మొదటి విడతగా రూ.1,00,000 లంచం మొత్తాన్ని కృష్ణయ్య బాధితుడి నుంచి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణయ్యను విచారించగా.... డిఎమ్‌హెచ్‌ఓ స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకే ఈ లంచం డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించారు. అధికారులిద్దరూ తమ అధికారిక బాధ్యతలను నెరవేర్చడంలో అక్రమాలకు పాల్పడి, స్వలాభం కోసం లంచం ఆశించారని ఏసీబీ ధృవీకరించింది.
ఈ కేసుపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@Telangana ACB) లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న క్యూఆర్ (QR) కోడ్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

