...
...
Next Story

ఈడీ చరిత్రలోనే తొలిసారి.. రూ. 792 కోట్ల ఫ్రాడ్ కేసులో ప్రైవేట్ జెట్ విమానం వేలం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొలిసారి ఓ విమానాన్ని వేలం వేసింది. దీనిద్వారా వచ్చిన రూ.3 కోట్లను బాధితులకు అందించనుంది.

Published on: Jul 4, 2026, 09:25:45 IST
Advertisement

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక విమానాన్ని వేలం వేసింది. రూ. 792 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా, సీజ్ చేసిన 'హాకర్ 800A' ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ రూ. 3 కోట్లకు విజయవంతంగా విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన 'క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్' (ఫాల్కన్ గ్రూప్), దాని ప్రమోటర్లపై నమోదైన కేసులో భాగంగా ఈ విమానాన్ని జప్తు చేశారు. జూలై 1, 2026 న ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో MSTC ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు.

2025లో శంషాబాద్ విమానాశ్రయంలో జప్తు

ప్రైవేట్ జెట్ విమానం వేలం వేసిన ఈడీ
ప్రైవేట్ జెట్ విమానం వేలం వేసిన ఈడీ

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA) నిబంధనల ప్రకారం, 2025 మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో ఈ ప్రైవేట్ జెట్‌ను సీజ్ చేశారు. అనంతరం 2025 ఆగస్టులో పిఎంఎల్‌ఎ అడ్జుడికేటింగ్ అథారిటీ ఈ జప్తును ధృవీకరించింది.

ఆ తర్వాత 2025 నవంబర్‌లో ఈ జెట్ విమానాన్ని విక్రయించడానికి ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ నుండి ప్రత్యేక అనుమతి పొందింది. పిఎంఎల్‌ఎ రూల్స్-2013 ప్రకారం దీనికి అనుమతి లభించడంతో, ఈడీ చరిత్రలోనే ఇది మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ వేలంగా రికార్డు సృష్టించింది.

రూ. 792 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ మోసం

సైబరాబాద్ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(EOW) క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్, ఇతరులపై నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ఈ మనీ లాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది.

వివిధ వ్యాపార సంస్థలు కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌లను డిస్కౌంట్ ధరకు సెటిల్ చేస్తామంటూ, పెట్టుబడిదారులకు భారీ లాభాలు ఆశ చూపి ఈ సంస్థ మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సంస్థకు ఎలాంటి నిజమైన ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారం లేదని, కేవలం అబద్ధపు వాగ్దానాలతో పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులు వసూలు చేశారని ఈడీ స్పష్టం చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసింది. అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ సీఈఓ ఆర్యన్ సింగ్ ఛాబ్రాలను అధికారులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2025లోనే ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టులో ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది.

ప్రైవేట్ జెట్ వేలం ద్వారా వచ్చిన రూ. 3 కోట్ల సొమ్మును బాధితులకు పరిహారంగా పంపిణీ చేయనున్నారు. అయితే దీనికి ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు నుండి తుది అనుమతి రావాల్సి ఉంది. ఈ భారీ మోసానికి సంబంధించిన దర్యాప్తు, అలాగే అక్రమంగా సంపాదించిన మరికొన్ని ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఈడీ తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe