105 స్థానాల్లో మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక.. కాంగ్రెస్ ఖాతాలో 84, బీఆర్ఎస్ 17

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జోరు చూపించింది. 84 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఖాతాలోకి 17 స్థానాలు వెళ్లాయి.

Published on: Feb 16, 2026, 22:13:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఏడు కార్పొరేషన్లలో ఆరు కార్పొరేషన్లను సొంతం చేసుకుంది. అయితే కొత్తగూడెంలో మేయర్ పీఠాన్ని సీపీఐతో కలిసి దక్కించుకుంది. ఇక కరీంనగర్‌లో ఎంతో ఉత్కంఠ నెలకొన్న చివరకు.. బీజేపీ మేయర్ కుర్చీపై కూర్చుంది. మున్సిపల్ ఛైర్మన్ల విషయానికి వస్తే.. హస్తం పార్టీ హవా చూపించింది.

కాంగ్రెస్ ఖాతాలోకి 84 మున్సిపల్ ఛైర్మన్లు
కాంగ్రెస్ ఖాతాలోకి 84 మున్సిపల్ ఛైర్మన్లు

105 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఇందులో 84 కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. 17 బీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళ్లాయి. బీజేపీ ఒక్క మున్సిపాలిటీని సాధించింది. ఇక మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. బైంసా, కామారెడ్డి, ఆదిలాబాద్‌లో ఇండిపెండెంట్లుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ సీట్లలో కూర్చున్నారు. 36 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. కానీ వివిధ పార్టీల మధ్య పొత్తులు, ఇండిపెండెంట్ల మద్దతుతో ఛైర్మన్లు ఎన్నికయ్యారు.

11 మున్సిపాలిటీల్లో వాయిదా

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం.. 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్‌, వైస్ ఛైర్మన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు మంగళవారం(ఫిబ్రవరి 17) జరుగుతాయి. ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే : ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూర్, జనగాం ఉన్నాయి. మంగళవారం ఈ 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

మేయర్లు, డిప్యూటీ మేయర్లు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నికయ్యారు.

నిజామాబాద్‌లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ కలిసి కార్పొరేషన్‌లో ఉమారాణిని మేయర్‌ను చేశాయి. డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఉన్నారు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ను హస్తం పార్టీ సొంతం చేసుకుంది. మహంకాళి స్వామి మేయర్‌గా, పాతిపెల్లి ఎల్లయ్య డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. మేయర్‌గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్‌గా సిరిపురపు లలిత కుమారి ఎంపికయ్యారు.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. బుర్చి చైతన్యరెడ్డి మేయర్, మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్‌ను డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారు.

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుమల్ మమత మేయర్‌గా, సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

మంచిర్యాల కార్పొరేషన్‌లో హస్తం పార్టీ జెండా ఎగురవేసింది. మేయర్‌గా మధుకర్, డిప్యూటీ మేయర్‌గా రమ్య మహేశ్‌గా గెలిచారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More