...
...
Next Story

ఇకపై అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ : సీఎం రేవంత్ రెడ్డి

అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేయనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు దీని గురించి ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదని చెప్పారు.

Published on: Aug 15, 2026, 06:14:40 IST
Advertisement

విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

నెక్లెస్‌ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహారి, సలహాదారులు కే కేశవ రావు, వీ.హనుమంత రావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 'ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదు. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా పెడుతున్నాం. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.' అని తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. స్కిల్స్‌ ఉంటే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య, ఆ తర్వాత స్కిల్స్ నేర్పాలన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్పారు. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో.. చెప్పలేమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తామని చెప్పారు. మీరూ క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించండి. దేశ స్థాయిలో గౌరవాన్ని తీసుకురాండి. ఒలంపిక్స్‌‌లో మెడల్స్‌ సాధించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి.. నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

కేవలం చదువుకుంటేనే బతుకులు మారుతాయని, చదువుకుంటేనే మన తలరాతలు మారుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అవకాశాల కోసం పోటీ పడాలన్నారు.

'కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి అన్ని వర్గాలు ఒకే చోట కలిసిమెలిసి జీవించడమనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నాం. జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే లాంటి మహనీయుల జీవిత విశేషాలను వివరిస్తూ విగ్రహాలు చేయడం ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించడానికి కాదు. గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు, వారి గొప్పతనాన్ని విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందడానికి వేదికలుగా నిలుస్తాయి.' అని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe