Hyderabad : దీపావళి బాణసంచా ఎఫెక్ట్ - 32 మందికి కంటి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం…!
దీపావళి పండుగ వేళ హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి 32 మంది బాధితులు వచ్చారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దీపావళి పటాకుల బాణసంచా కాల్పులు విషాదాన్ని నింపాయి. హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం పరిధిలో ఉన్న ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి కంటి గాయాలతో కనీసం 32 మంది బాధితులు చికిత్స కోసం వచ్చారు. బాధితుల్లో అత్యధికులు చిన్నపిల్లలే ఉండటం గమనార్హం.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకుని ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగిలిన 26 మందికి ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైన మందులు ఇచ్చి ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు. వీరిని ఫాలో-అప్ చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి రావాలని సూచించారు.
ఇద్దరి పరిస్థితి విషమం..!
సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం వార్తా సంస్థ 'ఎఎన్ఐ'తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని….. వారికి శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్య బృందం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. "పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను పటాకులు కాల్చనివ్వవద్దు. ఎందుకంటే ఆస్పత్రికి వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉన్నారు," అని ఆయన విజ్ఞప్తి చేశారు.
బాణసంచా కాల్చేటప్పుడు తెరిచిన విశాలమైన ప్రదేశాలను ఎంచుకోవాలని, నిప్పురవ్వలు ఎగిరిపడినా లేదా ప్రమాదం జరిగినా వెంటనే ఆర్చేందుకు వీలుగా నీటిని సిద్ధంగా ఉంచుకోవాలని డాక్టర్ ఇబ్రహీం సూచించారు. ఒకవేళ పొరపాటున కంటికి గాయమైతే వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కడగాలని చెప్పారు. ఇంట్లో ఎలాంటి సొంత వైద్యం చేసుకోకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.
పరిస్థితిని సమీక్షించేందుకు నాంపల్లి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సరోజినీ దేవి ఆస్పత్రికి చేరుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి గాయపడిన వారి సంఖ్య పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి కంటి చూపు దెబ్బతిందని, దానిని తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదని వైద్యులు తనకు తెలిపారని ఆయన పేర్కొన్నారు. "ప్రజలంతా దీపావళి పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అయితే పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చేలా చూసుకోవాలి," అని హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

