మహిళలకు గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో 15,982 ఉద్యోగాలు.. ఈ ఏడాదిలోనే భారీ నోటిఫికేషన్
రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 15,982 ఖాళీల వివరాలు, అంగన్‌వాడీల ఆధునీకరణ ప్లాన్ గురించి ఇక్కడ చూడండి.
రాష్ట్రంలోని నిరుద్యోగులైన మహిళలకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతోంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది.

గత మూడేళ్లుగా అంగన్‌వాడీ సిబ్బందికి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్లు రావడం, కొందరు ఉద్యోగులు పదవీ విరమణ పొందడం, మరికొందరికి ఇతర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగాలు లభించడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైర్మెంట్ల ద్వారా కొత్తగా మరో 708 పోస్టులు తోడవ్వడంతో మొత్తం ఖాళీల సంఖ్య 15,982కి చేరింది.
మొత్తం పోస్టుల వివరాలు
- అంగన్‌వాడీ సహాయకులు (హెల్పర్స్): 12,882 పోస్టులు
- అంగన్‌వాడీ టీచర్లు/వర్కర్లు: 3,100 పోస్టులు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో 71,562 మంది పనిచేయాల్సి ఉండగా.. దాదాపు 22.33 శాతం పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ కొరతను తీర్చి, క్షేత్రస్థాయిలో సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ పోస్టులకు సంబంధించిన కనీస విద్యార్హతలు (సాధారణంగా 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానికత), వయోపరిమితి, కొత్త నియామక నిబంధనలపై మహిళా శిశు సంక్షేమ శాఖ త్వరలోనే అధికారిక స్పష్టత ఇవ్వనుంది. నూతన నియామక విధానానికి ప్రభుత్వం నుండి తుది ఆమోదం లభించిన వెంటనే.. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతాయి.
ఈ ఏడాది కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఈ సారి బడ్జెట్, కార్యాచరణలో భాగంగా పలు మార్పులు చేయబోతున్నారు. 3,300 కేంద్రాలకు సురక్షిత తాగునీటి కనెక్షన్లు, అలాగే 9 వేల కేంద్రాలకు కొత్తగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 7,700 కేంద్రాలలో అధునాతన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
5 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షితమైన ఆర్వో వాటర్ ప్లాంట్లతో పాటు, పిల్లలకు డిజిటల్ పాఠాలు నేర్పేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు వెయ్యి కేంద్రాలకు కొత్తగా శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. ఈ భారీ రిక్రూట్‌మెంట్, ఆధునీకరణ ద్వారా అంగన్‌వాడీల రూపురేఖలు మారడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది మహిళలకు ఉపాధి దొరకనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


