...
...
Next Story

18 జిల్లాల్లో తగ్గిన భూగర్భ జలమట్టాలు.. రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు!

వానాకాలం 2026 కోసం వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళికను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు పలు జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి.

Published on: Jul 17, 2026, 14:13:59 IST
Advertisement

తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వర్షభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలోని కేవలం ఐదు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 27 జిల్లాల్లో వర్షపాత లోటు ఉండగా ఒక జిల్లాలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. ఆగస్టు నాటికి వర్షపాతం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో ఇవి మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ నేపథ్యంలో, వర్షపాత లోటు, పడిపోతున్న భూగర్భ జలాలు, జలాశయాల్లో డెడ్ స్టోరేజీలు, రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘ఎల్‌నినో కంటింజెన్సీ ప్లాన్ వానాకాలం 2026’ (ప్రత్యామ్నాయ ప్రణాళిక)ను విడుదల చేశారు. ఈ నివేదికలో రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలోని రైతులు ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను తట్టుకోవడానికి కింది జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి. తక్కువ కాలవ్యవధిలో చేతికొచ్చేవి, కరువును తట్టుకునే పంట రకాలను సాగు చేయాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) ఏర్పాట్లు చేసుకోవాలి.

భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే వాతావరణ సూచనలను, సలహాలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి. వ్యవసాయ శాఖ, ICAR-CRIDA, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాయి. ఇందులో ప్రతి జిల్లాకు అనువైన ప్రత్యామ్నాయ పంటల వివరాలు, ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడానికి ప్రధాన పంటల యాజమాన్య పద్ధతులు, రైతులకు అవసరమైన సూచనలను పొందుపరిచారు.

ఎల్‌నినో పరిస్థితులు ఉన్న సంవత్సరాల్లో రుతుపవనాలు ఆలస్యం కావడం, సుదీర్ఘ పొడి వాతావరణం, అసమాన వర్షపాతం, రుతుపవనాలు త్వరగా ముగిసిపోవడం లేదా కొన్నిసార్లు హఠాత్తుగా భారీ వర్షాలు కురవడం వంటి వాతావరణ మార్పులు జరుగుతాయి. ఇవి పంటల ఎదుగుదలను, దిగుబడిని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో సాధారణం లేదా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, వానాకాలం సీజన్‌లో స్థిరమైన దిగుబడులు సాధించడానికి కింది చర్యలు అత్యంత కీలకమని నివేదిక పేర్కొంది:

ప్రత్యామ్నాయ ప్రణాళిక

కరువును తట్టుకునే, స్వల్పకాలిక పంటలను ప్రోత్సహించడం.

పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల (మిల్లెట్స్) వైపు పంట మార్పిడి చేయడం.

సమర్థవంతమైన నీటి యాజమాన్యం, నేలలో తేమను కాపాడే పద్ధతులు అవలంబించడం.

జలాశయాల్లో ఆందోళనకర నీటి నిల్వలు

రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారీ, మధ్య, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులలో నీటి మట్టాలు వాటి కనీస డ్రా డౌన్ లెవెల్ (MDDL - డెడ్ స్టోరేజ్)కు చాలా చేరవగా ఉన్నాయి.

గోదావరి బేసిన్‌లోని అన్ని భారీ, మధ్యస్థ జలాశయాలలో కలిపి కేవలం 27.69 టీఎంసీల వినియోగించదగిన నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల్లో కలిపి కేవలం 14.81 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ నీరు కేవలం అత్యవసర అవసరాలకు, అంటే ప్రధానంగా తాగునీటి సరఫరాకు మాత్రమే సరిపోతుంది. రాబోయే రోజుల్లో రుతుపవనాలు పుంజుకుని భారీగా వరదలు వస్తే తప్ప, చాలా జలాశయాల నుండి సాగునీటిని విడుదల చేసే అవకాశం ఎంతమాత్రం లేదని నివేదిక స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks