ఈ వాట్సాప్ న్యూ ఇయర్ విషెస్ మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసి పడేస్తుంది.. జాగ్రత్త

కొత్త ఏడాదిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా స్కామ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ 2026 న్యూ ఇయర్ విషెస్ పేరుతో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.

Published on: Dec 31, 2025, 20:03:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 నూతన సంవత్సర స్కామ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ ద్వారా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. మీ బ్యాంక్ ఖాతాను తుడిచిపెట్టేందుకు చూస్తున్నారు. సైబర్ నేరస్థులు ఈ స్కామ్‌ను ఉపయోగించి మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటాను దొంగిలించవచ్చు. యూజర్ల ప్రైవసీ దెబ్బతినవచ్చు. మోసగాళ్లు మీ ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.

హ్యాపీ న్యూ ఇయర్ స్కామ్
హ్యాపీ న్యూ ఇయర్ స్కామ్

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ సైబర్ నేరస్థులు హ్యాపీ న్యూ ఇయర్ స్కామ్ ఉపయోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కామ్ జరుగుతోంది. యూజర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షల కార్డులను పంపిస్తారు. ఇందులో లింక్ ఉంటుంది. వాటిని క్లిక్ చేస్తే మాల్‌వేర్ మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. ఇక మీ ఖాతాలో మనీ ఖాళీ అయినట్టే.

అంతేకాదు మీ పేరుతో అందమైన న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ క్రియేట్ చేస్తామంటూ కూడా ఎర వేస్తారు. అందుకోసం లింక్స్ పంపిస్తారు. వాటిని ఓపెన్ చేస్తే అంతేసంగతులు, మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మీ సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి, ఆర్థిక నష్టాలను కలిగించడానికి, వినియోగదారు గోప్యతను దెబ్బతీసే హానికరమైన APK ఫైల్‌ను కూడా విషెస్ రూపంలో పంపిస్తుంటారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ యూనిట్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం, వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మోసపూరిత లింక్‌లు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్‌లో న్యూ ఇయర్ స్కామ్ వేగంగా స్ప్రెడ్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షల స్కామ్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఉదాహరణకు ఇటీవలి కాలంలో మనకు తెలిసిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతోనే ఏపీకే ఫైల్స్ వాట్సాప్‌లో రావడం చూసి ఉంటాం. ఇప్పుడు కూడా మీకు తెలిసిన వారి నెంబర్ల నుంచి కూడా సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్, న్యూ ఇయర్ విషెస్ కార్డులు పంపించే అవకాశం ఉంది. వాటిని అస్సలు ఓపెన్ చేయకూడదు.

వినియోగదారులు సాధారణంగా ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా సందేశాన్ని అందుకుంటారు. మీ పేరు లేదా ఫోటోలతో నూతన సంవత్సర శుభాకాంక్షల కార్డును రూపొందించడానికి లింక్‌ను నొక్కమని ప్రేరేపిస్తారు. యూజర్ లింక్‌పై క్లిక్ చేస్తే, Happy New Year.apk వంటి పేర్లతో ఉన్న APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయిస్తారు. వేరే వెబ్‌పేజీకి మీరు వెళ్తారు. ఇది చూసేందుకు హానిచేయనిదిగా అనిపించినప్పటికీ, APKని ఇన్‌స్టాల్ చేయడం వలన మీ ఫోన్‌లో మాల్వేర్ ఇంజెక్ట్ అవతుంది. సైబర్ నేరస్థులు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ యూనిట్ ప్రకారం, సైబర్ నేరస్థులు ఈ స్కామ్‌ను ఉపయోగించి మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటాను దొంగిలిస్తారు. ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు, మీ ఫోన్‌ను వారి కంట్రోల్‌కి తీసుకోవచ్చు.

ఇక మరో స్కామ్ ఏంటంటే.. న్యూ ఇయర్ సందర్భంగా మీరు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చని మెసేజులు పంపుతారు. వాటిని క్లిక్ చేసి 90 శాతం డిస్కౌంట్ పొందండి అని చెబుతారు. పొరపాటున వాటిని క్లిక్ చేశారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఇక మీరు మరిచిపోవాల్సిందే.

APK పేరుతో వచ్చే శుభాకాంక్షలు, Happy New Year.APK అంటూ వచ్చే సందేశాలను క్లిక్ చేయకండి. గ్రీటింగ్స్ రూపంలో వచ్చే మెసేజ్‌లు, ఫైల్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సర సంబరంలో అకౌంట్లు ఖాళీ చేసుకోకండి.

తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. APK ఫైళ్లను ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయవద్దు. Google Play Store వంటి అధికారిక ప్లాట్‌ఫారమ్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లకు డేటా యాక్సెస్ ఇచ్చేముందు ఒకసారి ఆలోచించండి.

వినియోగదారులు హ్యాపీ న్యూ ఇయర్ స్కామ్‌కు గురైతే 1930లో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. లేదా cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ యూనిట్ ప్రకారం, వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల ఆర్థిక నష్టాలను పరిమితం చేయడంలో, దర్యాప్తులకు సహాయపడుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More