Smart Ration Card Status : స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం - మీ పేరు ఉందో లేదో ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి!

Smart Ration Card Status : తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది. అయితే మీ వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ కార్డుల ద్వారా 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తారు.

Published on: Aug 16, 2026, 12:12:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telang Smart Ration Card Status : తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా…. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏకకాలంలో పంపిణీ ప్రక్రియను చేపట్టారు.

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

గతంలో రాష్ట్రంలో సుమారు 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండేవారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులకు అవకాశం కల్పించింది. దీని ద్వారా అదనంగా 62 లక్షల మంది పేదలకు ఆహార భద్రత లభించింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 3 కోట్ల 42 లక్షల నుంచి 3 కోట్ల 43 లక్షల వరకు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్లకు పైగా ఆహార భద్రతా కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెల ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని సఫలంగా పంపిణీ చేస్తోంది. పేదల ఆకలి తీర్చడమే కాకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం కాగితాల రూపంలోనే రేషన్ కార్డులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటి స్థానంలోనే ఏటీఏం రూపంలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇప్పటికే పంపిణీ ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే పాత కార్డులు ఉన్నవారితో పాటు ఆన్ లైన్ లో అఫ్రూవ్ అయిన వారికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. రేషన్ విధానాన్ని సరళతరం చేయడం, సంక్షేమ ఫలాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

మీకు స్మార్ట్ రేషన్ కార్డు వస్తుందా..? స్టేటస్ చెక్ ఎలా..?

మీ కుటుంబ సభ్యుల వివరాలు ఆన్ లైన్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇందులో పేర్లు ఉన్నవారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. ఆన్ లైన్ లో పేర్లు ఉన్నవారంతా కూడా స్మార్ట్ రేషన్ కార్డు పొందేందుకు అర్హులవుతారు. అయితే ఈ వివరాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….

  • ముందుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct ని సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే "FSC Search" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ రేషన్ కార్డు నంబర్, పాత రేషన్ కార్డు నంబర్, FSC రిఫరెన్స్ నంబర్లలో ఏదో ఒకదానిని నమోదు చేయాలి.
  • ఆ తర్వాత మీ జిల్లాను ఎంచుకుని సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు ప్రస్తుత స్టేటస్, మీకు కేటాయించిన డీలర్ లేదా ఫెయిర్ ప్రైస్ షాప్ వివరాలు స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతాయి.
  • ఇలా మీ వివరాలు కనిపిస్తే… మీకు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేస్తుంది.

కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు లేదా కార్డులో పేర్లు చేర్చినవారు "FSC Application Search" ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీసేవా రసీదు నంబర్, అప్లికేషన్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సహాయంతో స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ జిల్లాను సెలెక్ట్ చేసి వివరాలు సమర్పిస్తే అప్లికేషన్ ఆమోదం పొందిందా, పెండింగ్‌లో ఉందా లేదా తిరస్కరణకు గురైందా అనే పూర్తి సమాచారం డిస్ ప్లే అవుతుంది. అఫ్రూవ్ అయితే మీకు కూడా స్మార్ట్ రేషన్ కార్డు అందుతుంది.

ఒకవేళ ఆన్‌లైన్‌లో వివరాలు కనిపిపోతే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. వివరాలు కనిపించనంత మాత్రాన మీకు స్మార్ట్ రేషన్ కార్డు రాదనే నిర్ణయానికి రావొద్దు. వెంటనే మండల పౌరసరఫరాల అధికారి (MRO/MSO) కార్యాలయాన్ని సంప్రదించి సమాచారాన్ని ధృువీకరించుకోవచ్చు. లేదా మీసేవా కార్యాలయానికి వెళ్లి మరోసారి కూడా అప్లికేషన్ సవరించుకోవచ్చు.

స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉంటుంది..?

కొత్తగా పంపిణీ చేస్తున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డులో అత్యాధునిక భద్రతా ఫీచర్లుంటాయి. ఈ కార్డులను కాపీ చేయడం గానీ, నకిలీలను సృష్టించడం గానీ సాధ్యపడదు. కార్డు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా, నాణ్యమైన మెటీరియల్‌తో రూపొందించారు. పై భాగంలో (ఎడమవైపు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో, పై భాగంలో (కుడివైపు)పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫొటో ఉన్నాయి. ఈ కార్డులో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంతకం, హోలోగ్రామ్, రిలీఫ్ టెక్ట్స్, మైక్రో టెక్స్ట్, డ్యూయల్ హిడెన్ ఇమేజ్, వాటర్ మార్క్, యూవీ లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ మహిళల పేర్లే యజమానిగా ముద్రణ చేస్తారు. కార్డు నంబర్, లబ్ధిదారుని పూర్తి చిరునామా (గ్రామం, మండలం, జిల్లా), కేటాయించిన డిపో (రేషన్ షాప్) సంఖ్య ఉంటాయి. రేషన్ సరుకుల పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఈ ఆహార భద్రత కార్డులే ప్రామాణికంగా మారనున్నాయి.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందడానికి ఈకేవైసీ ప్రక్రియ అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ పూర్తి చేసి ఉంటేనే వారికి కొత్త కార్డు అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోని వారికి కార్డుల పంపిణీలో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాంటి వారు వెంటనే తమ పరిధిలోని రేషన్ డీలర్లు లేదా సంబంధిత అధికారులను కలిసి ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచిస్తోంది. ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నవారికి మాత్రమే కొత్త ల్యామినేటెడ్ కార్డులు వేగంగా పంపిణీ కానున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More