జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో నామినేషన్లు తక్కువగానే ఉన్నప్పటికీ… చివరి రోజు ఊహించని రీతిలో పోటెత్తాయి. మంగళవారం అర్ధరాత్రి వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఊహించని రీతిలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చివరిరోజు పోటెత్తిన నామినేషన్లు…

ఆఖరి రోజు(అక్టోబర్ 21) నాటికి మొత్తం 321 నామినేషన్ల సెట్లు దాఖలయ్యాయి. క్యూలైన్ లో ఉన్నవారికి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అవకాశం కల్పించారు. మొదటి ఆరు రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా…. చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇక ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఏమైనా తప్పులు ఉంటే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇక పోటీ నుంచి ఉపసంహరణకు తుది గడువు 24వ తేదీగా నిర్ణయించారు. ఈ తేదీలోపు ఏవరైనా అభ్యర్థులు స్వయంగా పోటీ నుంచి తప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ తర్వాతనే… జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో ఫైనల్ గా ఎంత మంది ఉంటారనేది తెలుస్తుంది. మరోవైపు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపును నవంబర్ 14న చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక ఈ ఉపఎన్నికలో ఈస్థాయిలో నామినేషన్లు దాఖలు కావటానికి పలు కారణాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా సిటీ రైతులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో భూములు కోల్పోనున్న రైతులు కూడా ఈ వరుసలో ఉన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ…. మాల సంఘాల నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు ఫైల్ అయ్యాయి. వీరి నుంచే కాకుండా పలువురు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నుంచి కూడా నామినేషన్లు వేశారు. మొత్తంగా నగరం నడిబొడ్డున జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజుకింత పొలిటికల్ హీట్ ను పెంచుతోంది…!
ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.
{{/usCountry}}ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.
{{/usCountry}}2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు దక్కాయి.
ఈ ఉప ఎన్నిక కోసం గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఖరారయ్యారు. ఈ బై పోల్‌ను మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతానికి ప్రచారం జోరుగా సాగుతోంది.