'రెంట్ బాయ్‌ఫ్రెండ్' ఆఫర్ల పేరుతో వల... అమ్మాయిలూ జర జాగ్రత్త! - సీపీ సజ్జనార్ హెచ్చరిక
ఒంటరితనం, డేటింగ్ పేరుతో సోషల్ మీడియాలో 'రెంట్ బాయ్‌ఫ్రెండ్' ఆఫర్లు ఇస్తూ సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త ట్రాప్ పై సిటీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ తరహా ఆకర్షణీయమైన పోస్టర్ల వెనుక ఒక పెద్ద సైబర్ మోసం దాగి ఉందనే విషయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త రకం డేటింగ్ ట్రాప్ ఇది.

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా "ఫస్ట్ ఆగస్ట్ స్పెషల్ - 50% ఆఫర్", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
కలర్‌ఫుల్ ప్యాకేజీలు…. అసలు మోసం ఇక్కడే!
ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించినవి లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రదర్శిస్తూ పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెస్తున్నారు. ఒక గంట కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ.4,499 అంటూ కేటుగాళ్లు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని….. ఇది ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. ఆపై బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేస్తారు. డబ్బులు అకౌంట్‌లో పడగానే సదరు ప్రొఫైళ్లను లేదా అకౌంట్లను పూర్తిగా బ్లాక్ చేస్తారు.
అంతటితో ఈ మోసం ఆగదు. ఆన్‌లైన్ సంభాషణలను నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని మరింత సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా….. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశమూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కఠిన చర్యలుంటాయి - సీపీ సజ్జనార్
ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేపట్టి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు..? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలి. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై సరియైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.
కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి ఎవరూ మోసపోకూడదు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయడం కానీ, నేరుగా కలవడం కానీ చేయవద్దు. ముందస్తుగా రూపాయి కూడా చెల్లించకూడదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా…. లేదా సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

