న్యూ ఇయర్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పక్కాగా నిఘా పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తుండగా…. తాజాగా క్యాబ్స్, ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రైడ్స్ నిరకారించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ ప్రకటన చేశారు.
ఉపేక్షించేది లేదు - సీపీ సజ్జనార్

న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా సహించేదే లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించమన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
"మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే మాకు తెలియజేయండి. వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ వివరాలను దరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ +91 94906 16555 కు పంపించండి" అని సీపీ సజ్జనార్ సూచించారు.
విస్తృత తనిఖీలు…
మరోవైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని నియంత్రించే దిశగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా వారం రోజుల నుంచి నగరంలో ప్రత్యేక 'డ్రంక్ అండ్ డ్రైవ్' సోదాలు కొనసాగుతున్నాయి.
ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని కూడా చెబుతున్నారు.