డెలివరీ బాయ్స్ కష్టాలు.. 10 నిమిషాల దారికి 7 నిమిషాలే టైమ్.. బాధ చెప్పుకోవడానికి మనిషే లేడు!

హైదరాబాద్ డెలివరీ బాయ్స్ కష్టాలపై ఐఎల్ఓ అధ్యయనం చేసి కీలక విషయాలను తెలిపింది. తమ గోడు చెప్పుకోవడానికి కనీసం మనుషులు కూడా ఉండటం లేదని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Nov 20, 2026, 14:52:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలోని ఫుడ్, గ్రాసరీ డెలివరీ బాయ్స్ (గిగ్ వర్కర్లు) ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి, అసంబద్ధమైన టార్గెట్లపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO - International Labour Organisation) సంచలన విషయాలను బయటపెట్టింది. నావిగేషన్ యాప్స్ (గూగుల్ మ్యాప్స్ వంటివి) కనీసం 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని చూపించే ప్రయాణాలకు కూడా, డెలివరీ యాప్ సంస్థలు కేవలం 7 లేదా 8 నిమిషాల డెడ్‌లైన్ విధిస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇంతటి ఒత్తిడిలో ఏదైనా సమస్య వచ్చి ఆలస్యమైతే, తమ గోడు చెప్పుకోవడానికి కనీసం ఆయా కంపెనీల్లో మనుషులు కూడా అందుబాటులో ఉండటం లేదని నివేదిక స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఫిర్యాదుల పరిష్కారం, కార్మిక వివాదాల పరిష్కార యంత్రాంగాల అందుబాటుపై అవగాహన పేరుతో ఇటీవల ఈ నివేదిక విడుదలైంది. ఇందులో రైడ్-హెయిలింగ్ (క్యాబ్/బైక్ ట్యాక్సీ), డెలివరీ, హోమ్-సర్వీస్ కార్మికుల సమస్యలను అధ్యయనం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ చట్టం, 2026 అమలుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. కార్మికుల సంక్షేమం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ చట్టాన్ని తెస్తున్నారు. అయితే కేవలం యాప్ కంపెనీలు నడిపే ఫిర్యాదుల వ్యవస్థపైనే ఆధారపడకుండా, బయట నుంచి కూడా కార్మికులు తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకునే సమర్థవంతమైన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఐఎల్‌ఓ సూచించింది.

తమ జీతాల్లో కోతలు, జరిమానాలు, సంపాదన లెక్కల గురించి యాప్ సంస్థలు ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని హైదరాబాద్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ లెక్కలను అర్థం చేసుకోవడానికి తోటి కార్మికులు, వాట్సాప్ గ్రూపులపైనే ఆధారపడుతున్నామని తెలిపారు.

యాప్‌లలోని ఆటోమేటెడ్ ఫిర్యాదుల వ్యవస్థలు చాలా కఠినంగా ఉంటున్నాయని, వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకునేలా లేవని నివేదిక పేర్కొంది. కస్టమర్లు ఫోన్ ఎత్తకపోయినా, అందుబాటులో లేకపోయినా ఆ ఆలస్యాన్ని కూడా డెలివరీ బాయ్స్ పనితీరు స్కోరులో మైనస్‌గా లెక్కిస్తున్నారని గిగ్ వర్కర్లు వాపోయారు. ఆర్డర్లు, ఇన్సెంటివ్‌లు ఎలా ఇస్తున్నారో తమకు అర్థం కాని రహస్యంలా ఉందని తెలిపారు.

కొద్దిమందికి మాత్రమే ఇన్సెంటివ్‌లు వస్తున్నాయని, కొందరికి వరుసగా ట్రిప్పులు వస్తుంటే, మరికొందరు గంటకు పైగా ఒక్క ఆర్డర్ కూడా రాక ఖాళీగా వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. పండుగల సమయంలో ఇన్సెంటివ్‌ల ఆశతో కొందరు డెలివరీ బాయ్స్ ఏకంగా 48 గంటల పాటు విరామం లేకుండా పనిచేస్తున్నారని, అయినా ఆర్డర్ల పంపిణీ ఎలా జరుగుతుందో వారికి తెలియదని ఓ కార్మికుడు వివరించాడు.

ఐఎల్‌ఓ ప్రధాన సూచనలు

గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఐఎల్‌ఓ పలు కీలక మార్పులను సూచించింది. కార్మికుల ఐడీలను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేసేటప్పుడు కచ్చితంగా మనుషుల పర్యవేక్షణ ఉండాలి. అన్యాయం జరిగితే అప్పీల్ చేసుకోవడానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చెల్లింపుల విధానంలో మార్పులు చేస్తే ముందుగానే కార్మికులకు స్పష్టంగా తెలియజేయాలి. యాప్ అల్గారిథమ్‌లు రోడ్లపై ట్రాఫిక్, ప్రతికూల వాతావరణం (వర్షం, ఎండ), కార్మికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని డెలివరీ సమయాన్ని నిర్ణయించాలి.

హైదరాబాద్‌లో క్యాబ్/రైడ్-హెయిలింగ్ డ్రైవర్లతో 5 బృంద చర్చలు, డెలివరీ బాయ్స్‌తో 2 బృంద చర్చలు, ఒక హోమ్-సర్వీస్ కార్మికుడితో ముఖాముఖి నిర్వహించి ఈ వివరాలు సేకరించారు. అయితే ఇవి కేవలం ఈ చర్చల్లో పాల్గొన్న వారి అనుభవాలు మాత్రమేనని, మొత్తం కార్మికులందరి అభిప్రాయాలుగా భావించలేమని ఐఎల్‌ఓ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం నగరాల్లో ఈ అధ్యయనం జరిగింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More