Hyderabad Airport : శంషాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు - ప్రపంచంలోనే 4వ అత్యుత్తమ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్

Hyderabad International Airport : ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలపై నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నాల్గోవ అత్యుత్తమ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. బ్రిటన్‌కు చెందిన అట్రాక్షన్ టికెట్స్ సంస్థ ఈ ర్యాంకింగ్స్ ప్రకటించింది.

Published on: Jul 14, 2026, 06:52:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad International Airport : భాగ్యనగర కీర్తికిరీటంలో మరో అంతర్జాతీయ మైలురాయి చేరింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించడంలో ఎప్పుడూ ముందుండే శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) గ్లోబల్ స్థాయిలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైన, సౌకర్యవంతమైన విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోనే 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

శంషాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు
శంషాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడర్ సంస్థ 'అట్రాక్షన్‌టికెట్స్.కామ్' (AttractionTickets.com) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో మన హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విశేషం ఏమిటంటే….. ఈ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న కేవలం రెండు భారతీయ విమానాశ్రయాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచి దేశ ప్రతిష్టను పెంచింది.

ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారికంగా వెల్లడించింది. అట్రాక్షన్‌టికెట్స్.కామ్ గ్లోబల్ స్థాయిలో నిర్వహించిన 'హ్యాపియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ ర్యాంకింగ్' (Happiest Airports Ranking) లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140కి పైగా ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి అక్కడ లభించే సౌకర్యాలు, భద్రత, మానసిక ప్రశాంతత వంటి 9 కీలకమైన పారామితుల ఆధారంగా ఈ విశ్లేషణ చేపట్టారు. ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో మొత్తం 20 పాయింట్లకు గానూ హైదరాబాద్ విమానాశ్రయం 18.5 పాయింట్లతో అద్భుతమైన స్కోరు సాధించి నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. 2026 మే నెలలో సేకరించిన డేటా ఆధారంగా ఈ తుది ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.

ర్యాంకింగ్స్ లోని 9 కీలక అంశాలు ఇవే:

  • గూగుల్ రివ్యూ రేటింగ్స్ (వినియోగదారుల స్పందన)
  • పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు
  • కుటుంబాల కోసం ప్రత్యేక సెక్యూరిటీ లేన్లు
  • పసిపిల్లల డైపర్లు మార్చే గదులు
  • ఉచిత బేబీ స్ట్రాలర్ సర్వీసులు (ఉచితంగా ఇచ్చే పిల్లల బండ్లు)
  • విశ్రాంతి, నిద్ర కోసం ప్రత్యేక జోన్లు
  • హై-స్పీడ్ వై-ఫై సదుపాయం
  • ఎయిర్‌పోర్ట్ పరిమాణం, ప్రయాణ అనుకూలత
  • ప్రత్యేక అవసరాలు గల (న్యూరోడైవర్జెంట్) ప్రయాణికులకు అందించే మద్దతు

ఈ అంతర్జాతీయ గౌరవంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ కదిర్ కదిరవన్ హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోనే అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్లీ విమానాశ్రయాలలో ఒకటిగా హైదరాబాద్ నిలవడం మాకు ఎంతో గర్వకారణం. ఆధునిక ప్రయాణికుల అవసరాలను గుర్తిస్తూ, వారందరికీ సమ్మిళితమైన, ఆలోచనాత్మకమైన అనుభూతిని అందించాలనే మా నిరంతర కృషికి దక్కిన గుర్తింపు ఇది. మారుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలతో అంతర్జాతీయ ప్రమాణాలను మరింత పెంచేందుకు ఈ పురస్కారం మా బాధ్యతను మరింత పెంచింది" అని కదిర్ కదిరవన్ వివరించారు.

కుటుంబ సమేతంగా వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సులువుగా ప్రయాణించేలా చూడటంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. టెర్మినల్‌లోని అన్ని అంతస్తులలోనూ పిల్లల ఆట స్థలాలు, ఫ్యామిలీ రూమ్‌లు, అత్యాధునిక సౌకర్యాలు గల బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రుల కోసం ఉచితంగా బేబీ స్ట్రాలర్లను అందిస్తున్నారు. అంతేకాకుండా, విమానాశ్రయంలో ప్రయాణికులకు అడుగడుగునా సహాయం చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ప్యాసింజర్ సర్వీస్ అసోసియేట్స్ నిరంతరం అందుబాటులో ఉంటారు. మానసిక ఒత్తిడిని తగ్గించే థెరపీ డాగ్స్, యోగా రూమ్, విభిన్న రకాల ఫుడ్ కోర్టులు, ఫ్యామిలీ షాపింగ్ అవుట్‌లెట్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, మానవీయ విలువలతో కూడిన సేవలు కలగలిసిన తరం విమానాశ్రయాలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More