ఖైరతాబాద్ బడా గణేష్ 2026 : ఈ సారి పంచముఖ సంకటహార మహా గణపతిగా దర్శనం - వైభవంగా కర్ర పూజ

Khairatabad Ganesh 2026 : ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణపతి 69 అడుగుల "పంచముఖ సంకటహర మహాగణపతి" రూపంలో దర్శనమివ్వనున్నాడు, విగ్రహానికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలుంటాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి జరగనుండగా, ఖైరతాబాద్ ఉత్సవాలకు 72 ఏళ్లు పూర్తవుతున్నాయి. 

Published on: Jun 26, 2026, 12:16:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భాగ్యనగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ మండపం వద్ద విగ్రహ తయారీకి సంబంధించిన తొలి పూజ (కర్రపూజ)ను ఉత్సవ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమంతో భాగ్యనగరంలో వినాయక చవితి శోభ ముందే వచ్చేసింది.

ఖైరతాబాద్ బడా గణపతి
ఖైరతాబాద్ బడా గణపతి

నమూనా విడుదల…

ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల కోసం 69 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో బడా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఐదు తలలు, ఎనిమిది చేతులతో విరాజిల్లే ఈ విశిష్ట నమూనాను ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విడుదల చేశారు.

ఈ మహా గణపతికి కుడి వైపున సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళీమాత విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేకంగా పంపిన పసుపు, కుంకుమలను ఉపయోగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం విశేషం.

సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి వేడుకల కోసం ప్రభుత్వం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన సూచనలు చేశారు.

ఈ విశిష్టమైన కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు విగ్రహ శిల్పి రాజేంద్రన్ సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాబోయే మూడు నెలల పాటు శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో వందలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More