వాహనదారులకు అలర్ట్: మార్చి 1 నుంచి వచ్చే ఈ రూల్ తెలిస్తేనే రోడ్డు మీదకు బండి తీయండి!

మార్చి 1వ తేదీ నుంచి పోలీసులు ఇకపై ట్రాఫిక్ రూల్స్ విషయంలో మరింత సీరియస్‌గా ఉండనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Published on: Feb 11, 2026, 15:26:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 1, 2026 నుండి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్(DL) లేకుండా వాహనం నడుపుతున్న వాహనదారులపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తారు. ఈ విషయంపై హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) జోయెల్ డేవిస్ మాట్లాడారు. వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వీలైనంత త్వరగా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(RTA) నుండి దానిని పొందాలని చెప్పారు.

మార్చి 1 నుంచి కొత్త రూల్
మార్చి 1 నుంచి కొత్త రూల్

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం లైసెన్స్ లేని డ్రైవర్ల వల్లే జరుగుతుందని పోలీసు అధికారులు గుర్తించారు. ఇటీవల మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వడం వలన కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై కూడా పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలను నడపడానికి అనుమతించకుండా వాహన యజమానులను కూడా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పనులు చేసి, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనం ఇవ్వడం శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు.

లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, బీమా క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు. దీని వలన తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రోడ్డు భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, ఈ డ్రైవ్‌కు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు పోలీసులు.

బైక్ మీద చేసే విన్యాసాలు చేస్తే చర్యలు

మరోవైపు బైక్ మీద చేసే విన్యాసాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల హెచ్చరించారు. రోడ్డు మీద చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూడ్డానికి థ్రిల్లింగ్ ఉండొచ్చని, క్షణకాలంలో కిక్ ఇస్తాయని చెప్పారు. చిన్న ప్రమాదం జరిగినా.. జీవితాంతం మంచాన పడాల్సి వస్తుందనే విషయం మరచిపోకూడదని చెప్పారు. అంతే కాదు మీ వల్ల ఇతరులు ప్రమాదాలబారిన పడొచ్చని తెలిపారు.

సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, రోడ్డు మీద హీరోయిజం కోసం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. బాధ్యతగా డ్రైవ్ చేయాలన్నారు. బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ, వెనక కూర్చున్న వారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్న ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమన్నారు. కేసుల పాలై సమస్యలను కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

స్కూటీ ముందు భాగంలో పిల్లలను నిల్చోబెడుతున్నారా?

స్కూటీ ముందు భాగంలో పిల్లలను నిల్చోబెట్టడంపై సజ్జనార్ సూచనలు చేశారు. వాహనం ఆపినప్పుడు లేదా పిల్లలు దిగుతున్నప్పుడు పొరపాటున వారు యాక్సిలరేటర్ తిప్పితే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని వివరించారు. చిన్న అజాగ్రత్త పెద్ద అనర్థానికి దారితీయొచ్చని, తల్లిదండ్రులూ.. దయచేసి గమనించాలని కోరారు.

  • బండి ఆపగానే ఇగ్నిషన్ ఆఫ్ చేసి, తాళం (Key) తీసేయండి.
  • పిల్లలు బండి దిగేటప్పుడు బ్రేక్ గట్టిగా పట్టుకోండి.
  • 'ఇంజిన్ కిల్ స్విచ్' వాడటం అలవాటు చేసుకోండి.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More