Hyderabad Police : అమ్మాయిలూ...పెళ్లి సంబంధాలపై జర జాగ్రత్త..! నగరంలో కొత్త రకం మోసాలు, గుడ్డిగా నమ్మకండి

పెళ్లిల పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని… అమ్మాయిలు జర జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Published on: Feb 23, 2026, 10:32:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేమ పేరుతో జరిగే మోసాలే కాదు… పెద్దలు కుదిర్చిన పెళ్లిలలోనూ మోసాలు చేస్తున్నారంట..! ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉన్నాయని నగర పోలీసులు చెబుతున్నారు షీ టీమ్స్ కు కూడా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ఇదే విషయంపై హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అమ్మాయిలకు పోలీసుల సూచనలు (representative image ) (image pixel)
అమ్మాయిలకు పోలీసుల సూచనలు (representative image ) (image pixel)

“హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి” అని సీపీ సజ్జనార్ తెలిపారు.

మోసం జరుగుతున్న తీరు ఇదీ..

ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్ళే కదా.. ఇప్పుడైతే ఏంటి..? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒత్తిడితో శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలి.

గుడ్డిగా నమ్మకండి - సీపీ సజ్జనార్

“పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించండి, ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు. ఫిర్యాదు చేయండి” అని సీపీ సజ్జనార్ సూచించారు.

మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. “మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేయండి” అని తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More