Hyderabad : వీసా గడువు ముగిసినా ఇక్కడే…! 49 మంది విదేశీయులు గుర్తింపు, విచారణలో షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌లో వీసా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న 49 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వీరిలో 12 మందిని సొంత దేశాలకు పంపించివేశారు. అద్దె ఇళ్ల యజమానులకు సీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Published on: Oct 4, 2026, 10:53:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చెల్లుబాటు అయ్యే వీసా గడువు ముగిసినప్పటికీ చట్టవిరుద్ధంగా బస చేస్తూ… పలు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న విదేశీయులపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ బ్రాంచ్-ఫారిన్ మోనిటరింగ్ సెల్, ఫారిన్ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO), స్థానిక శాంతిభద్రతల పోలీసులు మరియు ఐటీ సెల్ బృందాలు సంయుక్తంగా ఈ విస్తృత తనిఖీలను చేపట్టాయి. వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నివాసముంటున్న విదేశీయుల గుర్తింపు, వారి కదలికల ట్రాకింగ్‌ను పోలీసులు తీవ్రతరం చేశారు.

వీసా గడువు ముగిసినా ఇక్కడే…! 49 మంది విదేశీయులు గుర్తింపు
వీసా గడువు ముగిసినా ఇక్కడే…! 49 మంది విదేశీయులు గుర్తింపు

ప్రత్యేక నిఘా…

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి వెలువడిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 31 నుంచి నగరం వ్యాప్తంగా ఈ ప్రత్యేక సంయుక్త సోదాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో అక్రమంగా బస చేస్తూ, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విదేశీయులను ఏరివేసేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. విదేశీయుల తనిఖీలను పటిష్టం చేయడం, వీసా నిబంధనలు అమలయ్యేలా చూడటం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు, వీరికి ఆశ్రయం కల్పించే ఇంటి యజమానులు, హోటళ్ల నిర్వాహకులకు చట్టపరమైన బాధ్యతలపై అవగాహన కల్పించడమే ఈ సోదాల ప్రధాన లక్ష్యం.

ఈ విస్తృత సోదాల్లో ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన 49 మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ సెంటర్లకు తరలించారు. వీరిలో ఇద్దరు మహిళలతో సహా 12 మందిని ఇప్పటికే వారి సొంత దేశాలకు డిపోర్ట్ (హాజరు పరిచి పంపించివేయడం) చేశారు. మిగిలిన వారిని కూడా వారి దేశాలకు పంపించే ప్రక్రియను విదేశాంగ, ఇమ్మిగ్రేషన్ అధికారుల సమన్వయంతో వేగవంతం చేశారు.

అత్యధికంగా టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మంది, లంగర్ హౌస్‌లో 6, మెహదీపట్నంలో 6, రాజేంద్రనగర్‌లో 3, బంజారాహిల్స్‌లో 2, సైఫాబాద్‌లో 1, గుడిమల్కాపూర్‌లో ఒకరిని పోలీసులు గుర్తించారు.

వెలుగులోకి కీలక విషయాలు…

రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్న సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విదేశీయులు కేవలం వీసా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా…. భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా అనేక అక్రమ, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించాయి.

పోలీసుల విచారణలో కొందరు విదేశీయులు నకిలీ కరెన్సీ చెలామణి, మోసపూరిత దందాలు నడుపుతున్నట్లు తేలింది. ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు గుంజుతున్న వీరిపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. సోదాల సమయంలో ఒక విదేశీయుడి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మరికొందరు విదేశీయులు ఆసుపత్రుల్లోని ట్రాన్స్‌లేటర్ (అనువాదక) సేవలను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండిపోయిన కొందరు విదేశీయులు.. విదేశాల నుంచి వచ్చే రోగులకు ఆసుపత్రుల్లో దళారులుగా మారారు. రోగుల నుంచి నేరుగా ట్రాన్స్‌లేషన్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా, ఆసుపత్రి బిల్లులో ఏకంగా 15 శాతం వరకు కమిషన్ పొందుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

మరికొందరు విదేశీ మహిళలు వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అధికారులు గుర్తించారు. టూరిస్ట్ వీసాపై వచ్చి అక్రమంగా ఉంటున్న ఒక కెన్యా దేశస్తురాలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. మరో కేసులో, మత్తు పదార్థాలకు బానిసైన ఒక విదేశీయుడు ఆల్ ప్రాజోలం మాత్రలను దగ్గు మందులో కలుపుకుని తాగుతూ మత్తు పొందుతుండగా పట్టుకున్నారు.

రాజేంద్రనగర్ ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో సౌత్ సుడాన్ దేశానికి చెందిన ముగ్గురు పట్టుబడ్డారు. వీరు 2018, 2023, 2025 నుంచి స్టూడెంట్ వీసాల గడువు ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉంటున్నారు. అనుమానంతో వీరి నుంచి డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, గంజాయి (కానాబిస్) తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది.

కఠిన చర్యలుంటాయి - పోలీసులు

ఈ సందర్భంగా నగర పోలీసులు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. "చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా మరియు ఇతర అవసరమైన పత్రాలు కలిగి ఉండి, భారతీయ చట్టాలను గౌరవిస్తూ నివసించే విదేశీయులకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం. అయితే చట్టవ్యతిరేకంగా అక్రమంగా బస చేయడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడటం సహించేది లేదు. అలాంటి వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం," అని తేల్చి చెప్పారు.

విదేశీయులకు ఆశ్రయం కల్పించే ఇళ్ల యజమానులు, ల్యాండ్‌లార్డ్‌లు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల యజమానులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని పోలీసులు హెచ్చరించారు.

  • విదేశీయులకు గదులు లేదా ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పాస్‌పోర్ట్, వీసా వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
  • విదేశీయుల బసకు సంబంధించిన సమాచారాన్ని ఫారమ్ III/C (Form III/C) ద్వారా అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలి.
  • ఎవరైనా నకిలీ పత్రాలతో లేదా గడువు ముగిసిన వీసాతో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
  • ఈ నిబంధనలు వాణిజ్య లేదా వ్యాపారేతర అవసరాలకు ఇచ్చే నివాసాలన్నింటికీ వర్తిస్తాయి. OCI కార్డ్ హోల్డర్లు, నేపాల్, భూటాన్ పౌరులకు ఆశ్రయం ఇచ్చినప్పుడు కూడా చట్టపరమైన నివేదన నిబంధనలు పాటించాలి.

ఈ తనిఖీలను కేవలం ఒక ఆచారంగా కాకుండా, పౌరుల భద్రత మరియు చట్టబద్ధమైన బాధ్యతగా భావించి సహకరించాలని పోలీసులు కోరారు. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక తనిఖీల డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More