Hyderabad Police : సైబర్ మోసాలపై ఇంటి నుంచే FIR - మీకోసమే 'సీ-మిత్ర'..! సేవలు ఎలా పొందాలంటే..?
సైబర్ మోసాల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ నగర పోలీసులు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపై పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పనిలేకుండానే… ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్ పొందేందుకు అనువుగా ‘సీ-మిత్ర’ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వివరాలను సీపీ తెలిపారు.
సైబర్ మోసాలకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. ఆ దిశగా హైదరాబాద్ నగర పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.బాధితులకు సహాయపడటానికి రూపొందించిన వర్చువల్ హెల్ప్ డెస్క్ ‘సి-మిత్ర’ను శుక్రవారం ప్రారంభించారు. దేశంలోనే ఈ తరహా సేవలు రావటం ఇదే తొలిసారి అని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

“హైదరాబాద్ లో సైబర్ నేరాల బాధితులు ఇకపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అన్న ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. బాధితులకు అండగా నిలుస్తూ, ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా దేశంలోనే తొలిసారిగా 'సీ-మిత్ర' పేరుతో వినూత్న విధానాన్ని ప్రారంభించడం జరిగింది. కృత్రిమ మేథా (ఏఐ) సహకారంతో పనిచేసే ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభతరం కానుంది” అని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఈ ప్రత్యేకమైన సేవలు అందుబాటులో ఉంటాయి. “సైబర్ క్రైం బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు దేశంలోనే తొలిసారిగా 'సీ-మిత్ర' (C-Mitra) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం” అని సీపీ సజ్జనార్ వివరించారు.
సేవలు ఎలా పొందాలంటే..?
- సీ-మిత్ర ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుంది.
- బాధితులు మొదట '1930' హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం ద్వారా సైబర్ మోసం రిజిస్ట్రర్ అవుతుంది.
- వివరాలను నివేదించిన తర్వాత, సి-మిత్ర బృందానికి చెందిన వర్చువల్ పోలీసు అధికారులు బాధితులను సంప్రదిస్తారు.
- ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితుల వాట్సప్ నంబరుకు పంపుతారు.
- బాధితులు ఈ కాపీని ప్రింట్ తీసి, సంతకం చేసి ‘సైబర్ మిత్ర హెల్ప్‌డెస్క్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్‌స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్‌బాగ్ హైదరాబాద్ 500029’ చిరునామాకు పంపవచ్చు.
- సంతకం చేసిన కాపీలను సమర్పించడానికి స్టేషన్ వద్ద డ్రాప్ బాక్స్ అందుబాటులో ఉంది.
- ఫిజికల్ కాపీని అందుకున్న తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఎంఎస్ ద్వారా బాధితురాలికి వివరాలను పంపుతారు.
- ప్రస్తుతం భౌతికంగా సంతకాలు తప్పనిసరి. అయితే, భవిష్యత్తులో డిజిటల్ సంతకం ఆప్షన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
- హెల్ప్‌డెస్క్ అధికారిక ఫోన్ నంబరు 040-41893111తో మాత్రమే సీ-మిత్ర నుంచి కాల్స్ వస్తాయి.
- సీ-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ సూచించారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సగటున మూడు గంటలు పడుతుందని పోలీసులు తెలిపారు. పౌరుల సమయాన్ని ఆదా చేయడానికి మరియు స్టేషన్ సిబ్బంది దర్యాప్తుపై దృష్టి పెట్టడానికి సి-మిత్ర రూపొందించబడింది.
ప్రస్తుతం హెల్ప్ లైన్, నేషనల్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో కేవలం 18 శాతం మాత్రమే ఎఫ్ఐఆర్లుగా మారుతున్నాయి. సి-మిత్ర ద్వారా ఈ మార్పిడి రేటును 100 శాతానికి పెంచాలని హైదరాబాద్ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

