AI Copwriter : హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి 'ఏఐ కాప్‌రైటర్'.. దేశంలోనే తొలిసారి! ప్రత్యేకతలివే
Hyderabad Police AI Copwriter : దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రారంభించారు. దీని ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలను వెంటునే టెక్ట్స్‌గా మార్చి అనువాదం చేస్తుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
Hyderabad Police AI Copwriter : హైదరాబాద్ మహానగర పోలీసింగ్ వ్యవస్థలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా…… వారి ఫిర్యాదులను త్వరితగతిన, పక్కా కచ్చితత్వంతో నమోదు చేసే దిశగా అడుగు ముందుకేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా 'ఏఐ కాప్‌రైటర్' (AI CopWriter) అనే కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) లో శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ వినూత్న యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దాని పనితీరును స్వయంగా పరిశీలించారు.
హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ మెట్రో నగరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, పర్యాటకులు నిరంతరం ఉంటారు. వీరిలో తెలుగు, ఇంగ్లీష్ రాని వారు ఏదైనా క్రైమ్ బారిన పడి పోలీస్ స్టేషన్‌కు వస్తే ఫిర్యాదు చేయడం ఒక పెద్ద సవాలుగా మారేది. బాధితుడి భాష పోలీసులకు, పోలీసుల భాష బాధితుడికి అర్థం కాక ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదులో తీవ్ర జాప్యం జరగడం, కొన్నిసార్లు సమాచారం తప్పుగా రికార్డు అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఈ తీవ్రమైన ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ….. నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ 'ఏఐ కాప్‌రైటర్' యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్ ద్వారా బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే డిజిటల్ రూపంలో రికార్డు చేసి…. అనువదించుకోవచ్చు. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను (హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ తదితర) గుర్తించే అద్భుత సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న అప్లికేషన్‌ను 'బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్' సంస్థతో పాటు ఇంటర్న్ 'పాగ్రో చందు' సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ సెల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.
'ఏఐ కాప్‌రైటర్' యాప్ ప్రత్యేకతలు :
ఈ యాప్ పోలీసింగ్ రికార్డుల నిర్వహణ శైలిని పూర్తిగా మార్చివేయడమే కాకుండా వేగం, పారదర్శకతను పెంచుతుంది. దీని ప్రధాన ఫీచర్లు ఇలా ఉన్నాయి:
- బహుభాషా సౌలభ్యం (Multilingual Support) : బాధితుడు తన సొంత మాతృభాషలో (ఉదాహరణకు హిందీ లేదా బెంగాలీ) మాట్లాడితే… యాప్ దానిని వెంటనే రాతపూర్వక రూపంలోకి మార్చేస్తుంది. అక్కడ ఉండే పోలీసు అధికారులకు అర్థమయ్యే అధికారిక భాషలోకి తర్జుమా చేస్తుంది.
- రియల్ టైమ్ అప్‌డేట్ : బాధితులు మాట్లాడుతున్నప్పుడు ప్రతి 5 సెకన్లకు ఒకసారి సమాచారం ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతూ రికార్డు అవుతుంది. దీనివల్ల అనువాదకుల (Translators) కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా… కేవలం సెకన్లలోనే ఫిర్యాదు ప్రక్రియ పూర్తవుతుంది.
- మల్టీ-పార్టీ లేబులింగ్ (Multi-Party Labeling) : పోలీస్ స్టేషన్‌లో ఒకే సమయంలో బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను ఈ యాప్ వేర్వేరుగా గుర్తిస్తుంది. ఎవరి స్టేట్‌మెంట్‌ను వారి పేరుతో విడివిడిగా రికార్డ్ చేయగలదు.
- టాంపర్ ప్రూఫ్ పారదర్శకత : ఫిర్యాదును రికార్డ్ చేసిన అధికారి వివరాలు, కచ్చితమైన సమయం (టైమ్ స్టాంప్) వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ (PDF) రూపంలో లాక్ చేయబడతాయి. దీనివల్ల రికార్డులను వెనుక నుంచి మార్చడం లేదా తారుమారు చేయడం సాధ్యపడదు.
భాష ఎప్పటికీ అడ్డంకి కాకుడదు - సీపీ సజ్జనార్
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని సీపీ సజ్జనార్ వివరించారు. న్యాయం పొందడానికి భాష ఎప్పటికీ అడ్డంకి కాకూడదనే స్పష్టమైన లక్ష్యంతో ఈ ఏఐ కాప్‌రైటర్ యాప్‌ను ప్రవేశపెట్టామని ప్రకటించారు.
"ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై మరింత భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా రికార్డ్ చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, కోర్టులలో నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. ఇది పోలీసు అధికారులకు టైపింగ్ భారాన్ని తగ్గించడమే కాకుండా…. స్మార్ట్ పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది," అని సీపీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

