...
...
Next Story

కోఠిలో చోరీ, కాల్పుల ఘటన : నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ - కాలినడకన పారిపోయినట్లు గుర్తింపు..!

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు… ఓ వ్యాపారి నుంచి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Published on: Jan 31, 2026, 16:39:08 IST
Advertisement

హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన దోపిడీ, కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు, నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు.

కాల్పుల ఘటనపై సీపీ సజ్జనార్ ప్రకటన

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల ఘటన
కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల ఘటన

“ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026 గా కేసు నమోదు చేయబడింది. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 109 (హత్యాయత్నం), 309 (దోపిడీ) ఆయుధ చట్టం-1959 లోని సెక్షన్ 27 కింద అభియోగాలు మోపబడ్డాయి” అని సీపీ సజ్జనార్ తెలిపారు.

“ఫిర్యాదుదారుడు కేరళలోని కోజికోడ్‌కు చెందిన రిన్షాద్ పి.వి. (26) (తండ్రి: అబ్దుల్ అజీజ్), రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ప్రస్తుతం నాంపల్లిలోని జనతా అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. జనవరి 7, 2026న దివాన్ దేవ్ఢీలో హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం రూ. 6 లక్షల నగదుతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కొనుగోలు కుదరకపోవడంతో… తన బంధువు మిష్బాన్ సలహా మేరకు ఆ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి నిర్ణయించుకున్నాడు” అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

“జనవరి 31, 2026న ఉదయం సుమారు 7 గంటలకు, తన స్నేహితుడు అమీర్‌కు చెందిన వాహనంపై కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నగదు జమ చేస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుండి వచ్చి…. తుపాకీని కడుపు వద్ద పెట్టి బెదిరించారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా…. అందులో ఒకటి ఫిర్యాదుదారుడి కుడి కాలికి తగిలి గాయమైంది. అనంతరం నిందితులు నగదు సంచితో పాటు వాహనం తాళంచెవులను బలవంతంగా లాక్కొని, బాధితుడి వాహనం (రిజిస్ట్రేషన్ నం. TS 08 HN 8582)లోనే అక్కడి నుంచి పరారయ్యారు” అని సీపీ సజ్జనార్ వివరించారు.

హైదరాబాద్ నగర పోలీసులు ఈ ఘటనపై తక్షణ చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను సేకరించడం, పొరుగు పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమన్వయం చేసుకోవడం జరుగుతోందని సీపీ సజ్జనార్ తెలిపారు.

“పౌరుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. నిందితులను త్వరగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం అన్ని వనరులను వినియోగిస్తోంది. అనుమానాస్పద కదలికలకు సంబంధించిన సమాచారం ఏదైనా ప్రజల వద్ద ఉంటే వెంటనే 'డయల్ 100' ద్వారా పోలీసులకు తెలియజేయగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని నగర సీపీ సజ్జనార్ ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీపీ పుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. తుపాకీ కాల్పులు జరపటంతో పాటు బైక్ పై పారిపోతున్న దృశ్యాలు కూడా ఇందులో రికార్డు అయ్యాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe