LPG Cylinder Frauds : గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు - క్లిక్‌ చేస్తే మీ ఖాతా ఖాళీనే, జర జాగ్రత్త..!

వంట గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ముందస్తుగా ఎక్కువ సిలిండర్లు బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదును చూసుకున్న సైబర్ కేటుగాళ్లు…. మోసాలకు పాల్పుడుతున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.

Published on: Mar 11, 2026, 17:36:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ఏకంగా ప్రకటన కూడా చేసింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేయాలని తెలిపింది.

గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

కట్ చేస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకొని.. మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్…. హెచ్చరిక ప్రకటన చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలిపారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని పేర్కొన్నారు.

తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు.

ఆ లింక్స్ పై క్లిక్ చేయండి - సీపీ సజ్జనార్

“ముఖ్యంగా, ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలి. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి” అని నగర సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.

“నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలి.లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి” అని ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More