Medical Tourism : జూన్‌ నెలలో హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం ఈవెంట్

Medical Tourism : హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు.

Published on: Apr 28, 2026, 21:46:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌ను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా జూన్‌లో ఒక అంతర్జాతీయ మెడికల్ టూరిజం ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఫార్మాస్యూటికల్ రంగాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ కార్యక్రమానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానరసింహ అధికారులను ఆదేశించారు.

మెడికల్ టూరిజం
మెడికల్ టూరిజం

ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని, అలాగే ఆరోగ్య, ఫార్మాస్యూటికల్ రంగాలలోని ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ భాగస్వాముల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమం పరిధిని, విస్తృతిని బలోపేతం చేయడానికి మెడికల్ టూరిజం రంగంలోని ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే ప్రతినిధులను నగరంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్), గాంధీ హాస్పిటల్ వంటి ప్రైవేట్, ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో పర్యటనకు తీసుకువెళతారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్స్‌లో ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఒక్కో హాస్పిటల్‌లో 50 బెడ్లతో ఇంటర్నేషనల్ పేషెంట్స్ వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పేషెంట్లతో ప్రభుత్వ హాస్పిటళ్లకు ఆదాయం సమకూరుతుందని, తద్వారా హాస్పిటళ్ల నిర్వాహణ మెరుగుపడి స్థానిక ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్లకు మే 12వ తేదీన ఇంటర్నేషన్ నర్సెస్ డే సందర్భంగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ హాస్పిటల్స్‌, మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్స్‌లో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అలాగే, ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(MPHA-Female) పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు.

వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఫార్మసిస్ట్‌, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న లీగల్ చిక్కులను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రెండేళ్లలో సుమారు 12,650 పోస్టులను భర్తీ చేశామని, మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయితే.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More