...
...
Next Story

పీఎస్ఎస్ పథకంలో మొక్కజొన్న, జొన్నలను చేర్చండి : కేంద్రానికి తుమ్మల లేఖ

Price Support Scheme : పీఎస్ఎస్ పథకంలో మరికొన్ని పంటలను కూడా చేర్చాలని కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. పరిమితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Published on: May 05, 2026 03:42 PM IST
Advertisement

ధరల మద్దతు పథకం(పీఎస్ఎస్)లో మొక్కజొన్న, జొన్నలను చేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం సేకరణ పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల

కేంద్ర మంత్రికి రాసిన లేఖలో రాష్ట్రంలో రబీ సీజన్‌లో పండించే వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై ఉన్న 25 శాతం సేకరణ పరిమితిని కేంద్రం ఎత్తివేయాలని తుమ్మల పేర్కొన్నారు. ఈ పరిమితుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మిగిలిన పంటను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రం ఆర్థిక భారాన్ని మోస్తోందని అన్నారు. కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా మొత్తం ఉత్పత్తిలో 25 శాతమైన 29,860 మెట్రిక్ టన్నుల శనగలను సేకరించడానికి, అలాగే 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వులను సేకరించడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు.

అయితే అనుమతించిన పరిమితుల మేరకు కొనుగోలు గత వారమే పూర్తయిందని తుమ్మల వెల్లడించారు. రైతుల వద్ద ఇంకా పంట మిగిలి ఉందని, దానిని అమ్మకం కోసం మార్కెట్లకు తీసుకువస్తున్నారని తెలిపారు. కేంద్రం ఆమోదించిన పరిమితులు ఇప్పటికే దాటిపోయినందున.. శనగల సేకరణ పరిమితిని 1,12,077 మెట్రిక్ టన్నులకు, పొద్దుతిరుగుడు పువ్వుల సేకరణను 10,839 మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి తుమ్మల అభ్యర్థించారు.

తెలంగాణలో విస్తృతంగా సాగు చేసే మొక్కజొన్న, జొన్నలను పీఎస్ఎస్ పథకంలో చేర్చి, కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా సేకరించాలని కూడా మంత్రి డిమాండ్ చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా 1.121 మిలియన్ల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఎకరానికి 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అన్నారు.

'3,68,000 ఎకరాల్లో జొన్న సాగు చేయగా, ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనా. రైతులు జొన్న పంటను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించారు. మార్కెట్లో లాభదాయక ధరలు లేకపోవడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కోసం 246 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత రబీ సీజన్‌లో కనీస మద్దతు ధర వద్ద సుమారు 3,99,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసింది.' అని మంత్రి తుమ్మల తెలిపారు.

కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 1.489 మిలియన్ మెట్రిక్ టన్నుల (14,899,520 క్వింటాళ్ల) మొక్కజొన్న, 276,000 మెట్రిక్ టన్నుల (276,277 క్వింటాళ్ల) జొన్నను సేకరించడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని, తక్కువ ధరలకు అమ్ముకోవలసిన పరిస్థితిని నివారించవచ్చని తుమ్మల పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe