TG Inter Admission schedule 2026 : తెలంగాణ ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల - ఈనెల 8 నుంచి అడ్మిషన్లు.. పూర్తి సమాచారం
TG Inter Admission schedule : 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 8 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అడ్మిషన్ల నిబంధనలు, రిజర్వేషన్లు, తరగతుల ప్రారంభం వంటి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Telangana Inter Admission schedule 2026 : తెలంగాణలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు వివరాలను ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈనెల 8 నుంచి దరఖాస్తులు….
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల ప్రక్రియ మే 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
- మొదటి విడత ప్రవేశాల ప్రారంభం: మే 8, 2026
- దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: మే 31, 2026
- తరగతుల ప్రారంభం: జూన్ 1, 2026
- మొదటి విడత ప్రవేశాల ముగింపు: జూన్ 30, 2026
విద్యార్థుల నమోదు ప్రక్రియలో ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జూన్ 1 నుంచే క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో….. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు కల్పించవచ్చని సూచించారు. అయితే ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ఈ అడ్మిషన్లు ఖరారవుతాయి.
అడ్మిషన్ల ప్రక్రియలో రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బోర్డు ఆదేశించింది. కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి:
- ఎస్సీ (SC): 15%
- ఎస్టీ (ST): 10%
- బీసీ (BC): 29% (A-7%, B-10%, C-1%, D-7%, E-4%)
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS): 10%
- దివ్యాంగులు (PH): 5%
- ఎన్.సి.సి, క్రీడలు, ఇతర రంగాలు: 5%
- మాజీ సైనికోద్యోగుల పిల్లలు: 3%
- బాలికలకు ప్రత్యేక రిజర్వేషన్: మహిళా కళాశాలలు లేని చోట, ప్రతి కేటగిరీలో 33.33 శాతం సీట్లను బాలికలకే కేటాయించాలి.
ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు హెచ్చరించింది. కేవలం టెన్త్ క్లాస్ జీపీఏ (GPA) మరియు సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలి. నిబంధనలు అతిక్రమిస్తే సదరు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అలాగే.... ప్రైవేట్ కళాశాలలు ఒక్కో సెక్షన్‌కు కేవలం 88 మందిని మాత్రమే చేర్చుకోవాలని, బోర్డు అనుమతించిన సెక్షన్ల కంటే అదనంగా విద్యార్థులను చేర్చుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో ఒక కీలక మార్పును ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పును అరికట్టడానికి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా 'యాంటీ డ్రగ్ అఫిడవిట్' సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థుల భద్రత, ముఖ్యంగా బాలికల రక్షణ కోసం ప్రిన్సిపాల్స్ తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..... జోగిని పిల్లల అడ్మిషన్ల సమయంలో తండ్రి పేరుకు బదులుగా తల్లి పేరును నమోదు చేయాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్యార్థులు లేదా ఓసీఐ (OCI) కార్డు ఉన్నవారు అడ్మిషన్ పొందిన 24 గంటల్లోగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫామ్-II వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ అడ్మిషన్లు పొందే ముందు సదరు కళాశాలకు బోర్డు గుర్తింపు ఉందో లేదో www.tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

