...
...
Next Story

నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం.. అదే రోజున చీరలు పంపిణీ

Indiramma Bima : నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అదే రోజున ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామన్నారు.

Published on: Nov 6, 2026, 05:32:36 IST
Advertisement

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 38వ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. నిర్మాణం పూర్తయిన అన్ని ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

కేబినెట్ నిర్ణయాలు
కేబినెట్ నిర్ణయాలు

డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రపంచంలో దిగ్గజ కంపెనీల భారీ పెట్టులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మూడు బ్యారేజీల ప్రధాన లోపాలను NDSA చేసిన సూచనలకు లోబడి పరీక్షలు నిర్వహించినట్టుగా పొంగులేటి చెప్పారు. NDSA సూచనల ప్రకారం ఈ ప్రాజెక్టుకు మరమ్మత్తులు అవసరమైనా నిర్మాణాలు చేసి త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. నవంబర్ 7 నుంచి 9 వరకు కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారన్నారు. నవంబర్ 9న కొడంగల్‌లో భారీ రైతు బహిరంగ సభ నిర్వహిస్తారని, ఈ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు.

'నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేటలో భారీ బహిరంగ సభ వేదికగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం. ఇదే వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ కూడ ప్రారంభం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరిస్తాయి. తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది.' అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రమాదాలకు కారణాలను గుర్తించడం, వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయన్నారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారన్నారు.

'తెలంగాణ సర్వే మరియు సరిహద్దుల చట్టం, 1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులలో, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో వివిధ విభాగాలకు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం 136 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.' అని పొంగులేటి వివరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks