ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం.. పంటలు వేయెుద్దు : మంత్రి పొంగులేటి

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రాబోయే రోజుల్లో ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు కరువుపై దృష్టి పెట్టి రెండో పంటను వేయొద్దని సూచించారు.

Published on: Oct 27, 2026, 21:30:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో పారదర్శకమైన భూ యాజమాన్య రికార్డులు, వివాదరహిత భూ పరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా భూభారతిని తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా అధికారుల సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పౌరులకు ఆధార్ కార్డు ఉన్నట్లే, ప్రతి భూ యజమానికి, వారి భూమికి భూదార్ పేరిట ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాటిలైట్ చిత్రాలతో కూడిన కచ్చితమైన భూ పటాలను కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో పొందుపరచనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

గతంలో అమలు చేసిన ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు తలెత్తాయని, వాటిని అధిగమించేందుకు విప్లవాత్మక మార్పులతో భూభారతిని రూపొందించామని మంత్రి పొంగులేటి చెప్పారు. దాదాపు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇప్పటికే 380 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి పట్టాదారులకు హక్కు పత్రాలు అందజేశామని, మరో 900 గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరిందని తెలిపారు. తొలి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే వేగవంతం చేశామని, రాబోయే ఏడాదిన్నర కాలంలో తెలంగాణ వ్యాప్తంగా సర్వేను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్-నినో కారణంగా రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రతరం అయ్యే ప్రమాదముందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సింగూరుతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని హెచ్చరించారు.

సాగు నీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. రైతులు ఎంతో అనుభవజ్ఞులని, కరువు ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈసారి రెండో పంట సాగు చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు కూడా క్షేత్రస్థాయి వాస్తవాలను రైతులకు వివరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇప్పటికే 90 శాతం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించామని తెలిపారు. మిగిలిన 10 శాతం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రాబోయే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, పెండింగ్ నిధుల విడుదలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమ సింగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More