క్యూర్ (హైదరాబాద్) పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇందిరమ్మ టవర్స్ నివాసాల కోసం ఎంపిక చేసిన అర్హులకు ఇప్పటికే ప్రొవిజినల్ కేటాయింపు పత్రాలను (అలాట్‌మెంట్ లెటర్లు) అందజేసినట్లు గుర్తు చేసింది. అయితే ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు వీలుగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గడువు పొడిగింపు…

ఈ ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులు మొదటి విడత వాటా కింద చెల్లించే రూ. లక్ష గడువు హౌసింగ్ బోర్డు గడువును పొడిగించింది. లబ్ధిదారులు తమ మొదటి విడత వాటా సొమ్మును ఈ నెల 9వ తేదీలోపు ఖచ్చితంగా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు జరిగిన ఇళ్ల కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే….. హౌసింగ్ బోర్డు అధికారులు మొత్తం 5,501 ప్రొవిజినల్ కేటాయింపు పత్రాలను జారీ చేశారు. అయితే వీటిలో ఇప్పటివరకు 3,271 మంది లబ్ధిదారులు మాత్రమే తమ మొదటి విడత వాటా కింద రూ. లక్ష చొప్పున చెల్లించారు. ఇంకా మిగిలిన లబ్ధిదారులు తమ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసమే లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 9వ తేదీ వరకు ఆఖరి అవకాశంగా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చెల్లించకపోతే కేటాయింపు రద్దు…
గడువు విషయంలో అధికారులు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయం అంటే ఈ నెల 9వ తేదీ లోగా మొదటి విడత సొమ్మును చెల్లించని లబ్ధిదారుల ప్రొవిజినల్ కేటాయింపు పత్రాలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే తక్షణమే రద్దు చేస్తామని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువు దాటిన తర్వాత చెల్లింపులు చేయకపోవడం వల్ల రద్దయిన ఫ్లాట్లను, ఇప్పటికే వెయిటింగ్ జాబితాలో ఉన్న ఇతర అర్హులైన అభ్యర్థులకు వరుస క్రమంలో కేటాయిస్తామని బోర్డు తేల్చిచెప్పింది. కాబట్టి ఎంపికైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన చెల్లింపులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.