తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
రైలు సర్వీసుల షెడ్యూల్ - టైమింగ్స్ :

ఈ కొత్త వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 17607/17608 నంబర్లను కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు సమయాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.
- కాచిగూడ - తిరుచానూరు (రైలు నంబర్ 17607) : గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 11:55 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
- తిరుచానూరు - కాచిగూడ (రైలు నంబర్ 17608) : తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తిరుచానూరు నుంచి బయలుదేరి…. శనివారం ఉదయం 9:00 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.
హాల్ట్ స్టేషన్లు….
ఈ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఈ రైలు తిరుచానూరు చేరుకుంటుంది.
హైదరాబాద్ జంట నగరాలు మరియు ఉమ్మడి నల్గొండ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయాణికులకు ఈ కొత్త రైలు సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ కోరింది.