కాకతీయుల కళకు మరో గౌరవం.. పాలంపేట గొల్లల గుడికి కేంద్రం అధికారిక గుర్తింపు

కాకతీయుల కళకు మరో గౌరవం దక్కింది. ములుగు జిల్లా పాలంపేట గొల్లల గుడిని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది.

Published on: Sep 2, 2026, 18:21:49 IST
By , Palampet
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాకతీయుల నాటి అత్యంత అరుదైన శిల్పకళా సౌందర్యానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని చారిత్రక గొల్లల గుడి(Gollala Gudi) దేవాలయాన్ని జాతీయ ప్రాధాన్యం కలిగిన కట్టడంగా (Monument of National Importance) ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారికంగా ప్రకటించింది.

గొల్లల గుడి
గొల్లల గుడి

యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రసిద్ధ కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయానికి నైరుతి దిశలో ఈ గొల్లల గుడి ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న తన అధికారిక గెజెట్‌లో ఈ నోటిఫికేషన్‌ను ప్రచురించినట్లు కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

పురావస్తు శాఖ నిపుణుల కథనం ప్రకారం గొల్లల గుడి త్రికూటాలయ నిర్మాణ శైలిలో నిర్మించారు. తూర్పు ముఖంగా విశాలమైన ఒక స్తంభాల మండపం ఉంటుంది. ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కుల్లో మూడు గర్భగుడులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన మధ్య గర్భగుడిలో శివలింగం కొలువై ఉంది.

ఈ ఆలయ పారాపెట్ గోడలు అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయ శైలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే జాలీ(రంధ్రాల పనితనం) డిజైన్లతో కూడిన హంసల వరుసలు, రాతి ద్వారబంధాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు వేర్వేరు చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. వీటిపై అత్యంత సూక్ష్మంగా చెక్కిన ద్వారపాలక విగ్రహాలు, అద్భుతమైన కపోతాలు, రాతి తెరలు దర్శనమిస్తాయి.

గొల్లల గుడి ఎత్తైన రాతి పీఠంపై నిర్మించారు. ఈ పీఠం అంతటా జంతువుల బొమ్మలు, నృత్య భంగిమలు, పూల డిజైన్లు చెక్కబడి ఉన్నాయి. ఆలయ అంతర్గత గోడల గూళ్లలో విష్ణువు, లక్ష్మీదేవి, గణపతి, మహిషాసురమర్దిని విగ్రహాలు చెక్కబడి భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆలయ సంరక్షణకు ఏఎస్‌ఐ సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ఆలయ పైకప్పు మరమ్మతులు, వాటర్‌ప్రూఫింగ్ పనులు చేపడుతారు. చుట్టూ ఉన్న నేలను సమతలం చేయడం, దెబ్బతిన్న రాతి ఫ్లోరింగ్‌ను పునరుద్ధరించడంచేస్తారు. పర్యాటకులు, పరిశోధకులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక మౌలిక వసతులు కల్పిస్తారు.

కాకతీయులు తెలుగు నేలకు అపూర్వమైన శిల్పకళను, సాగునీటి చెరువుల వ్యవస్థను అందించారు. నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని భాగాలకు వీరి సామ్రాజ్యం విస్తరించింది. రామప్ప దేవాలయం సరసన ఇప్పుడు గొల్లల గుడికి కూడా జాతీయ గుర్తింపు లభించడంతో ములుగు జిల్లా పరిధిలోని పర్యాటక రంగానికి మరింత గుర్తింపు లభించనుంది. శతబ్దాల చరిత్రను తనలో దాచుకున్న గొల్లల గుడికి ఇప్పుడు జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు వచ్చింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More