kavitha New Party : డేట్ ఫిక్స్.. ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

kavitha New Party : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ప్రకటించేందుకు తేదీని ఫిక్స్ చేశారు.

Published on: Mar 27, 2026, 16:43:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని రాష్ట్ర యువతకు, ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు విస్మరించలేనంతటి ప్రాముఖ్యత కలిగిన విషయమని పేర్కొన్నారు. యువత రాజకీయ అంశాలకు దూరంగా ఉండకూడదని కోరారు.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

'తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయాలు మన పని కాదని భావించకండి. నిస్సందేహంగా, రాజకీయాలు మన పనే. రాజకీయాలు దైనందిన జీవితంలోని ప్రతి అంశంపై ప్రభావం చూపుతాయి. సామాన్య పౌరులకు దూరమైన విషయంగా వాటిని చూడకూడదు. రాజకీయాలు అంటే మరేదో క్లిష్టమైన రాకెట్ సైన్స్ కాదు. ఒకవేళ అది రాకెట్ సైన్స్ అయినప్పటికీ, మన జీవితంలో విస్మరించలేని అత్యంత ఆవశ్యకమైన విషయం.' అని కవిత అన్నారు.

ముఖ్యంగా తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేస్తూ రాజకీయ వ్యవస్థలో ప్రవేశించి, దానిలో అంతర్భాగంగా పనిచేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని కవిత పేర్కొన్నారు.

మేడ్చల్‌లోని మునీరాబాద్ దగ్గర అద్వయ ఫంక్షన్ హాలులో కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నట్టుగా కవిత ప్రకటించారు. అదే సమయంలో పార్టీ పేరును వెల్లడిస్తామన్నారు. తెలంగాణ జాగృతి సభ్యులు, కార్యకర్తలు, ప్రతీ గ్రామం నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలిరావాలని కవిత విజ్ఞప్తి చేశారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తెచ్చేందుకు మహిళగా ఈ పార్టీని పెడుతున్నట్టుగా కవిత పేర్కొన్నారు.

'బీసీ బిల్లు సాధించడం మా వల్లే సాధ్యమవుతుంద. బీసీలీ, దళితులు, గిరిజనులు, మైనారిటీలు పార్టీ ప్రకటన కార్యక్రమానికి తరలిరావాలి. తెలంగాణ రాజకీయాలను శ్రీరాముడి స్ఫూర్తితో గమనించాలి. నేను నిజామాబాద్ బిడ్డను. ఈ మట్టి మంచిది. ఇక్కడి నుంచి తీసుకునే ఏ నిర్ణయం అయినా సక్సెస్ అయింది.' అని కవిత అన్నారు.

గతంలో బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించలేకపోయామని కల్వకుంట్ల కవిత అన్నారు. రోజు ప్రజల అవస్థలు చూశామని చెప్పారు. అందులో భాగంగానే కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టుగా తెలిపారు. అందరూ మెచ్చేలా పార్టీ ఉంటుందని, సర్వోదయ తెలంగాణ రావాలని కవిత అన్నారు.

తాము ఎవరికీ బీ పార్టీ కాదు అని కవిత స్పష్టం చేశారు. తమది నెంబర్ వన్ పార్టీ అవుతుందన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పని చేస్తామన్నారు. పోటీ ఎక్కడ నుంచి చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కవిత అన్నారు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తా, గల్లీలో పని చేస్తానని కవిత స్పష్టంగా చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More