కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం - త్వరలో మరో ఉప ఎన్నిక..!
శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ ఆమోదించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి కవిత శాసనమండలికి ఎన్నికయ్యారు.
శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలికి ఎన్నికైన కవిత… బీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అప్పట్నుంచి ఆమె రాజీనామా లేఖ పెండింగ్ లోనే ఉంది. పలుమార్లు మండలి ఛైర్మన్ ను కూడా కవిత కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

తాజాగా జరిగిన శాసనమండలి సమావేశాలకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… తన రాజకీయ ప్రస్థానాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే తాను ఇచ్చిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో కవిత సమర్పించిన రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించారు. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఆమోదించారు. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీ అయిన ఈ స్థానం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపారు.
త్వరలోనే ఉప ఎన్నిక..!
కవిత రాజీనామా ఆమోదించటంతో త్వరలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి కవిత పదవీ కాలం మరో రెండేళ్ల పాటు ఉంది. కానీ ఆమె రాజీనామా చేయటంతో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపై ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.
కొత్త పార్టీ దిశగా…!
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత… సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది. ఆయా వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జాగృతి పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ జాగృతినే రాజకీయ పార్టీగా మార్చే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు.
ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని కవిత తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. 'అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీ కోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి.. రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను' అని ఇటీవలే శాసనమండలిలో కవిత భావోద్వేగంగా మాట్లాడారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

