జాగృతి జనం బాట : రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు సిద్ధమైన కవిత - కీలక ప్రకటన ఉంటుందా..?

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత… జాగృతి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అంశాల వారీగా ముందుకెళ్తున్న కవిత… ఇక రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ‘జాగృతి జనం బాట’ పేరును ఖరారు చేశారు. 

Published on: Oct 16, 2025, 14:14:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కల్వకుంట్ల కవిత… గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు చుట్టూ ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ కుమార్తెగానే కాకుండా… బీఆర్ఎస్ పార్టీలో అత్యంక కీలక నాయకురాలిగా పని చేస్తూ వచ్చారు. కానీ లిక్కర్ కేసులో అరెస్ట్, ఆ తర్వాత పరిణామాల తర్వాత కవిత… పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె రాసిన ఓ లేఖ బయటికి రావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీలోని కీలక నేతలపై బహిరంగంగానే కవిత విమర్శలు గుప్పించారు. ఆమె చర్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం… పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె పార్టీకి సంబంధం లేకుండా…. రాజకీయంగా అడుగులు వేస్తోంది.

జాగృతి జనంబాట - రాష్ట్రవ్యాప్తంగా కవిత యాత్ర
జాగృతి జనంబాట - రాష్ట్రవ్యాప్తంగా కవిత యాత్ర

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత… తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే పనిలో పడ్డారు. విభాగాల వారీగా కమిటీలను కూడా ప్రకటిస్తున్నారు. సందర్భాన్ని, సమయాన్ని బట్టి గత, ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రశ్నలను సంధిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యత అంశమని కవిత పదే పదే చెబుతున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కార్యాచరణను కూడా రూపొందించారు.

జాగృతి జనంబాట పేరుతో యాత్ర…!

ఈనెల 25 నుంచి జాగృతి జనం బాట పేరుతో కవిత యాత్ర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగానే కవిత విడుదల చేశారు. దీంతో జాగృతి కార్యక్రమాలను మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించారు.

యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా కవిత కీలక ప్రకటన చేశారు. ఈ యాత్రలో కేసీఆర్ ఫొటో పెట్టుకోమని చెప్పారు. జాగృతి సంస్థగా తాము గతంలో మా పని మేము చేసుకున్నామని.. అప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఫొటో పెట్టుకోబోమని స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు అవకాశాలు దక్కటమే సామాజిక తెలంగాణ అని మరోసారి చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో గతంలోనే చెప్పాని…. అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెబుతున్నానని క్లారిటీ ఇచ్చారు. మనం సామాజిక తెలంగాణ సాధించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో కూర్చొని సమస్యలు మాట్లాడటం కన్నా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవటమే లక్ష్యంగా కవిత ఈ యాత్రను చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో అన్ని వర్గాల వారితో వారి అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకునే దిశగా యాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించినట్లు తెలిసింది. ఈ యాత్ర తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

“రాజకీయంగా తెలంగాణలో స్పేస్ ఉందో లేదో నాకు తెలియదు. ప్రజలనే అడిగి వారు చెప్పినట్లు వింటాం. అందుకే ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉంటాం. సమగ్రమైన అధ్యయనం కోసం తెలంగాణ అంతటా తిరుగుతాం. అక్టోబర్ 25 నుంచి నిజామాబాద్ నుంచి ఈ యాక్ర ప్రారంభమవుతుంది ” అని పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు.

కొత్త పార్టీ పెడుతారా..?

నిజానికి బీఆర్ఎస్ కు దూరమైన వెంటనే కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ఆలోచన ఏం లేదని కవిత స్పష్టం చేస్తూ వచ్చారు. కానీ జాగృతి ద్వారా అంశాల వారీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లతో పాటు నిరుద్యోగుల అంశాలపై ప్రధానంగా పోరాడుతూ వచ్చారు. భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలను చేపట్టే యోచనలో కూడా కవిత ఉన్నారు.

ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి జాగృతిని మరింత బలంగా తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. గ్రౌండ్ లోని పరిస్థితులతో పాటు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి పార్టీ ఏర్పాటుపై కవిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ యాత్ర ఫిబ్రవరిలో ముగుస్తుంది కాబట్టి... ఆ తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది...!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More