Kazipet Rail Manufacturing Unit : తుది దశకు 'కాజీపేట్ రైల్' యూనిట్ - వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్‌ సిటీ రైళ్ల తయారీ..!

Kazipet rail manufacturing unit : తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ విద్యుత్ పొదుపు చేసే సాంకేతికతతో కూడిన 200 అత్యాధునిక ఇంటర్‌ సిటీ రైళ్లను తయారు చేయనున్నారు.

Published on: May 29, 2026, 13:28:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kazipet Rail Manufacturing Unit : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. వరంగల్ పరిధిలోని కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు విజయవంతంగా పూర్తి కావొచ్చాయి.

తుది దశకు 'కాజీపేట్ రైల్' యూనిట్
తుది దశకు 'కాజీపేట్ రైల్' యూనిట్

ఈ బహుళ ప్రయోజన రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి, సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్ల తయారీని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ప్రగతిపై ఆయన ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి,…. పనుల పురోగతి పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఐదేళ్లలో 200 ఆధునిక రైళ్ల తయారీ…

"తొలి దశలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేసే అద్భుతమైన లక్ష్యాన్ని కాజీపేట కేంద్రానికి కేటాయించాం" అని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కాజీపేట కేంద్రంలో రూపుదిద్దుకోబోయే ఈ సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు అత్యంత ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిపారు.

“ఇవి 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో (20 బోగీలు) నిర్మితం కానున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ (స్వయంచాలక తలుపులు), మెరుగైన వెంటిలేషన్ సిస్టమ్, సురక్షితమైన కోచ్ డిజైన్‌తో పాటు ప్రయాణంలో ఎలాంటి జెర్కులు (కుదుపులు) లేకుండా ఉండేందుకు వీలుగా ఆధునిక జెర్క్-ఫ్రీ కప్లర్స్, బోగీలను ఈ రైళ్లలో అమర్చనున్నారు” అని వివరించారు.

పట్టణాలను, నగరాలను కనెక్ట్ చేస్తూ షటిల్ సర్వీసుల తరహాలో నడిచే ఈ రైళ్లను దేశవ్యాప్తంగా తక్కువ దూరాల ప్రయాణాల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఇవి సాధారణంగా సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మార్గాలలో గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగిస్తాయి. తక్కువ దూరంలో ఉండే పట్టణాల మధ్య ప్రజలు సులభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతి ట్రిప్‌లోనూ ఈ రైళ్లకు ఎక్కువ సంఖ్యలో స్టాపింగ్‌లు కల్పిస్తారు. ఈ ఇంటర్‌సిటీ రైళ్ల రాకతో రోడ్డు మార్గాల ద్వారా జరిగే స్థానిక రవాణా రద్దీ (Local Traffic) చాలా వరకు రైల్వే వైపు మళ్లుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ఇంటర్‌సిటీ రైళ్ల రాకతో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఎనలేని మేలు జరగనుంది. "తమ సమీప పట్టణాలు, నగరాల్లో ఉన్నత చదువుల కోసం ప్రతిరోజూ ప్రయాణించే విద్యార్థులకు, నిత్యం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళ్లే సామాన్య ప్రజలకు, అలాగే అత్యవసర వైద్య ఆరోగ్య అవసరాల కోసం నగరాలకు వెళ్లే రోగులకు ఈ రైళ్లు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సరికొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా మారుతాయి" అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ సరికొత్త రైళ్లలో మరో అద్భుతమైన పర్యావరణ అనుకూల సాంకేతికతను జోడించారు. ఇవి 'రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ' (Regenerative Braking Technology) తో పనిచేస్తాయి. అంటే ఈ రైళ్లకు బ్రేకులు వేసిన ప్రతిసారీ స్వయంచాలకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తయిన కరెంటును తిరిగి పవర్ గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేయడమే కాకుండా… రోడ్డు రవాణాతో పోలిస్తే కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గిస్తుంది.

తెలంగాణకు నిరంతర సహకారం - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాజీపేట రైల్వే యూనిట్ పనులు తుది దశకు చేరుకోవడం ,ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ఆర్డర్లు దక్కడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక వృద్ధికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. కాజీపేట రైల్వే యూనిట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More